హర్యానాలో ‘‘హ్యాట్రిక్‌’’

-మోదీకి మోదం..రాహుల్‌కు ఖేదం!

-మిత్ర భేదం చేయికి తెచ్చిన చేటు!

-చీపురు చేతికిచ్చినా అందుకోని కాంగ్రెస్‌.

-ఆప్‌ మద్దతు లేక చేతులు కాల్చుకున్నది.

-హర్యానాలో ఆపన్న హస్తం వదులుకున్నది.

-కమలానికి చే జేతులా హస్తం ఊపిరిపోసింది!

-అత్యాశకు పోయి హర్యానాలో చెయ్యి విరగ్గొట్డుకున్నది.

-ఆప్‌ తో కలిస్తే ఫలితం వేరుగా వుండేది.

-ఇప్పటికీ కాంగ్రెస్‌ ఒంటెద్దు పోకడ మానుకుంటే మంచిది.

-ప్రాంతీయ పార్టీలతో అంటకాగితేనే భవిష్యత్తులో గెలిచేది.

-జమ్ము కాశ్మీర్‌ లో అనుసరించిన ఫార్ములా హర్యానాలో అనుసరిస్తే మేలు జరిగేది.

-ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

-మూడో సారి బిజేపి అధికారం దక్కించుకున్నది.

-డిల్లీలో గెలుపుకు బాటలు వేసుకున్నట్లైంది.

-ఆప్‌ 2 శాతం ఓట్లు కలిస్తే హస్తానికి తిరుగులేకుండా వుండేది.

-సర్థుకుపోకనే ఇంతకాలం సర్థేసుకుంటోంది.

-ఇంకా తేరుకోకపోతే కప్పేట్టేసుకోవడమే.

-ఎన్నికలంటే చేతులు దులిపేసుకోవడమే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 హర్యానా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల అంచనాలు తప్పాయి. ప్రీ పోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తలకిందులయ్యాయి. చాలా సర్వే సంస్దలు రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న లెక్కలే వేశాయి. కొన్ని సంస్ధలు హర్యానాలో కాంగ్రెస్‌, జమ్ము కశ్మీర్‌లో హంగ్‌ ప్రభుత్వం వస్తుందన్నాయి. కాని ఈ రెండు రకాల సర్వేలు కూడా తప్పని తేలిపోయాయి. ముచ్చటగా మూడోసారి హర్యానాలో బిజేపి విజయం సాధించింది. ఉత్తరాధిన తమదే ఆధిపత్యమని మరోసారి నిరూపించినట్లైంది. కాకపోతే జమ్ములో బిజేపి కొంత మెరుగ్గా సీట్లు సాధించినా కశ్మీర్‌లో మాత్రం చతికిలపడిరది. అయినా హర్యానాలో గెలిచి పరువు నిలబెట్టుకున్నది. బిజేపికి మరోసారి ఎదురులేదని నిరూపించుకున్నది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న మహారాష్ట్ర, డిల్లీ, జార్ఖండ్‌ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. అయితే హర్యానాలో పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు, తొలి రెండు మూడు రౌండ్లలో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి ముందుకు వెళ్లిపోయిన కాంగ్రెస్‌ ఒక్కసారిగా ఎందుకు వెనకపడి పోయిందని ఎవరికీ అర్దం కాకుండాపోయింది. తొలుత ఇక సంబరాలే మిగిలాయన్నంతగా ఆనందపడిన కాంగ్రెస్‌లో నిరాశ నిస్రృహలు ఆవహించాయి. వెంటనే స్పందించని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జైరాం రమేశ్‌ ఎన్నికల కమీషన్‌కు ఉత్తరం రాశారు. ఉదయయం 9గంటల నుంచి 11 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఒక రకంగా రెండు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు పార్టీలు చెరో రాష్ట్రాన్ని గెలుచుకున్నాయి. కాకపోతే జమ్ము కశ్మీర్‌ విషయంలో కూటమి మూలంగా కాంగ్రెస్‌ గట్టెక్కిందనేది అందరూ చెబుతున్నమాట. హర్యానాలో మాత్రం మూడోసారి కూడా బిజేపి ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది. అందువల్ల ఈ విషయాన్ని ఫిఫ్టీ..ఫిఫ్టీ విజయం అని మాత్రం చెప్పలేం. రెండు పార్టీలు సమానమే అయినా, బిజేపి మాత్రం కొంచెం ఎక్కువ సమానమని చెప్పకతప్పదు. ఇంతకీ హర్యానాలో కాంగ్రెస్‌ఎందుకు ఓడిపోయిందనేదానికి పెద్దగా విశ్లేషనలు అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో కాంగ్రెస్‌ ఒంటరి పోరును నమ్ముకుంటే ఓటమే దిక్కవుతుందని మాత్రం గ్రహిస్తే మంచిది. లేకుంటే దేశంలో ఇక్కడైనా ఇలాంటి ఫలితాలే వస్తాయని తెలుసుకుంటే మంచింది. హర్యానాలో ఇప్పటికే రెండు దఫాలుగా కాంగ్రెస్‌పార్టీ ఓటమి పాలైంది. ఇప్పుడు గట్టెక్కాలంటే ఇండియా కూటమిలో బాగస్వామ్య పక్షాలకు తగిన గుర్తింపు, ప్రాధన్యతనివ్వాలన్న మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్‌ పాటించలేదు. సహజంగా మిత్రులుగా కలిసి వచ్చేవారిని కలుపుకుపోయే రీతిలోనే కాంగ్రెస్‌ రాజకీయం వుండాలి. అంతే కాని తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు..మేమిస్తామన్న సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పొద్దు. కాంగ్రెస్‌ పార్టీకి పట్టువిడుపులు ఎంతో అవసరం. 1992 ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా కేంద్రంలో అదికారంలోకి వచ్చింది లేదు. ఇంత సుధీర్ఘ కాలంగా రాజకీయాలను కాంగ్రెస్‌ పార్టీ అంచనాలు వేయలేకపోతోంది. 2004 నుంచి 20014 వరకు పదేళ్ల కాలం పాటు యూపిఏ ప్రభుత్వం కాంగ్రెస్‌ ఆద్వర్యంలోనే సాగింది. అంటే పదేళ్ల క్రితం వరకు కూడా కాంగ్రెస్‌ ఒంటరి చేతికి ఇతర పార్టీల తోడుతోనే రాజకీయంచేసింది. ఆ సంగతి మర్చిపోయి రాజకీయం చేస్తామంటే ఫలితాలు ఇలాగే వుంటాయి. జమ్ము కశ్మీర్‌లో అనుసరించిన విధానాన్నే హర్యానాలో ఆచరించి వుంటే ఫలితం మరోలా వుండేది. కాంగ్రెస్‌కు విజయం తోడయ్యేది. హర్యానలో అదికారంలోకి వచ్చేది. కాని కాంగ్రెస్‌ చేజేతులా రాష్ట్రాన్ని పోగొట్టుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హర్యానాలో బిజేపిపై ప్రజల్లో వ్యతిరేకత వుంది. ఆ సంగతి బిజేపికి కూడా తెలుసు. కాని కాంగ్రెస్‌ను, కూటమిని ఎలా దెబ్బకొట్టొచ్చొ కూడా బిజేపికి తెలుసు. ఈ సంగతి కాంగ్రెస్‌ విస్మరించింది. పొత్తు ధర్మానికి విలువ ఇవ్వాల్సిందిపోయి, మిత్ర బేధం ముందు పెట్టింది. ఓటమిని కొని తెచ్చుకున్నది. చేతికి చీపురునందించి కమలాన్ని ఊడ్చేద్దాం..రాజకీయంగా వాడగొడదామని ఆప్‌ ముందుకు వస్తే కాంగ్రెస్‌ కాదనుకున్నది. ఆప్‌ మద్దతుదూరం చేసుకొని చేతులు కాల్చుకున్నది. కాంగ్రెస్‌కు ఆపన్న హస్తం అందిచేందుకు ఆప్‌ ఎంతో ప్రయత్నం చేసినా, కాంగ్రెస్‌ కాదనుకున్నది. దాంతో ఆప్‌ చీల్చిన ఓట్లతో కాంగ్రెస్‌ హర్యానాలో ప్రతిపక్షానికి పరిమితమైంది. రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులుండాలి. వేసే ఎత్తులకు ప్రత్యర్ధి పార్టీలు చిత్తయ్యేలా వుండాలి. మన వ్యూహాలు అర్ధం కాక ప్రత్యర్ధి పార్టీలు తలలు పట్టుకునేలా వుండాలి. తప్ప ప్రత్యర్ధులకు అధికారాన్ని కమలంలో పెట్టి ఇచ్చేలా వుండకూడదు. కాని కాంగ్రెస్‌ అదే చేసింది. తన ఓటమిని తాను కోరి తెచ్చుకున్నది. అతి విశ్వాసానికి పోయి కాంగ్రెస్‌ ఓటమిని కొని తెచ్చుకున్నది. అయితే ఇక్కడ ఆప్‌ చేసిన పొరపాటు కూడా వుంది. ఆప్‌ అత్యాశకు పోయింది. తమకు హర్యానాలో బలంగా బాగానే వుందిన అంచనా వేసింది. ఆంచనాలే ఆప్‌ కొంప కూడా ముంచాయి. కూటమికి ఆదిలోనే బీటలు తెచ్చుకొని విడివిడిగా తలపడ్డాయి. ఒకరినొకరు మెచ్చుకోవాల్సిన చోట తిట్టుకున్నారు. బిజేపికి అనుకూలమైన వాతావరణం సృష్టించారు. ప్రజల చీపురును మూలకు విసిరేసేలా చేసుకున్నారు. అసలు హర్యానాలో ఆప్‌కు ఉనికి లేకుండా చేశారు. ఆప్‌ రాజకీయాన్ని ప్రశ్నార్ధకం చేశారు. అనవసరంగా కేజ్రీవాల్‌ తన పరువు తాను తీసుకున్నట్లైంది. జైలులో వున్నప్పుడే అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌తో బేరానికి ఒప్పుకుంటే బాగుండేది. కాంగ్రెస్‌ ఇచ్చిన సీట్లు తీసుకుంటే ఫలితం రెండు పార్టీలకు అనుకూలంగా వుండేది. రెండు రాష్ట్రాలలో అధికారంలో వున్న ఆప్‌ మూడో రాష్ట్రంలో అదికారాన్ని పంచుకునే అవకాశం దక్కేది. తమ పార్టీని అతిగా ఊహించుకొని, కాంగ్రెస్‌ బలంగా వున్న స్ధానాలను కూడా కావాలని కోరుకున్నది. పొత్తు చర్చలు పూర్తి కాకుండానే హర్యానా మొత్తం అభ్యర్ధులను ప్రకటించింది. ఇది ఆప్‌ చేసిన మొదటి తప్పు. ఇక్కడ కాంగ్రెస్‌ మొండిపట్టు కూడా నిండా ముంచింది. చర్చలకు ఇంకాస్త సమయం కోరి వుంటే బాగుండేది. లేకుంటే ఆప్‌కు నచ్చజెప్పినా బాగుండేది. ఆప్‌కు విచ్చన 2శాతం ఓట్లు కాంగ్రెస్‌ కలిసొస్తే కూటమి స్వీప్‌చేసేది. బిజేపి చతికిలపడేది. ప్రజా వ్యతిరేకత, రైతు వ్యతిరేకత, జాట్ల వ్యతిరేకత హర్యానాలో వున్నా బిజేపి విజయం సాధించింది. బిజేపి సంప్రదాయమైన తన ఓటును నిలబెట్టుకున్నది. గెలుపును సునాయం చేసుకున్నది. ఇండియా కూటమి లుకలుకలు బిజేపికి కలిసివచ్చి విజయం వరించింది. ఎలా గెలిచినా గెలుపు గెలుపే. మరో ఐదేళ్ల దాకా కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమే. ఇంతకాన్న ఓ రాజకీయ పార్టీకి తలవంపులు ఏముంటాయి. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాల్సిన అసరరం వుంది. ఇప్పటికే ఆలస్యమైంది. పార్లమెంటు ఎన్నికలలోనే సరైన పొత్తు ప్రతిపాదనలు అనుసరిస్తే కాంగ్రెస్‌కు మరిన్ని సీట్లు వచ్చేవి. అయినా కాంగ్రెస్‌పై ప్రజలకు వున్న సానుభూతితో 99 సీట్లు వచ్చాయి. ఇప్పటికైనా తేరువాలి. పొత్తు ధర్మానికి కట్టుబడి వుండడం నేర్చుకోవాలి. కూటమి పార్టీలకు సరైన ప్రాధాన్యతనివ్వాలి. సర్ధుకుపోవడం లేకపోతే ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లోనూ సర్ధేసుకుంటూ ఇంత దూరం వచ్చింది. ఇంకా తేరుకోకోకపోతే మునిగిపోవడమే. ఒక వేళ జమిలి ఎన్నికలు వస్తే తుడిచిపెట్టుకుపోవడమే అన్నది మాత్రం కాంగ్రెస్‌ ప్రతిక్షణం గుర్తు పెట్టుకొని రాజకీయం చేయాలి. ఎన్నికలంటే చేతులు కలిపేలా వుండే రాజకీయం చేస్తేనే కాంగ్రెస్‌ బలపడుతుంది. లేకుంటే చేతులు దులిపేసుకుని రాజకీయానికి దూరం కావాల్సివస్తుంది. ఇదిలా వుంటే త్వరలో జరగనున్న మూడు రాష్ట్రాలలో గెలుపుకు బిజేపికి హర్యానా గెలుపు బూస్ట్‌ దొరికనట్లే. సర్వేలు, ఇతర పార్టీల రాజకీయాల వలలో పడకుండా బిజేపి తన సంప్రదాయ ఓటును కాపాడుకుంటూ పోతే చాలు తమ గెలుపుకు ఢోకా లేదన్నది మరోసారి రుజువు చేసుకున్నది. ఇదే రాజకీయం డిల్లీ, మహరాష్ట్ర, జార్ఖండ్‌లలో చేస్తే బిజేపి రెండు రాష్ట్రాలు ఖాతాలో వేసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రజల నాడిని ప్రతిపక్షాలు పట్టలేకపోతున్నాయి. ఉద్యమాలు చేయలేకపోతున్నాయి. ప్రజలకు భరోసా కల్పించలేకపోతున్నాయి. బిజేపిలాగా రాజకీయ ప్రచారంలో దూసుకుపోలేకపోతున్నాయి. ప్రచారాల్లోనూ వెనకబడిపోతున్నాయి. ఎన్నికల్లోనూ ఓటములు చవి చూస్తున్నాయి. అందుకే కమలం విరబూస్తూనే వుంది. చెయ్యికి ఓటమి మిగులుతూనే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!