
Harish Rao’s Strong Attack on BJP and Congress
బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.