వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో చలి తాండవిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఈ ప్రాంతాల గ్రామాలు, పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మరింతగా వణికిస్తోంది. సోమవారం జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో 7.1 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్ల గాలులు వీయడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రంగా ఉండడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి:
సదాశివపేట్ 7.9°, న్యాల్‌కల్ 8.0°, ఝరాసంగం 8.1°, మొగుడంపల్లి 8.2°, జహీరాబాద్, నల్లవల్లి, సత్వార్ 8.6°, మల్‌చల్మె 9.1°, దిగ్వాల్ 9.3°, పుల్కల్, కంగ్టి 9.8°, నిజాంపేట్ 9.9°, రాయికోడ్ 10.3°, జిన్నారం 10.4°, కొండాపూర్, హత్నూర్ 10.6°, నాగలిగిద, మునిపల్లి, కంది 10.9°, చౌటకూర్ 11.0°, గుమ్మడిదల 11.2°, అందోల్ 11.3°, కల్హేర్ 11.4°, ముక్తాపూర్, అన్నసాగర్ 11.5°, సంగారెడ్డి (కలెక్టరేట్) 11.6°, కంకోల్ 12.1°, వట్టిపల్లి 12.2°, పాశమైలారం 12.5°, రామచంద్రపురం (గీతం) 12.6°, పటాన్‌చెరు 14.4°, బీఏచ్‌ఈఎల్ 15.1°, అమీన్‌పూర్ (సుల్తాన్‌పూర్) 15.5° కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి.. డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారిణి, ఝరాసంగం
దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీక్యాప్‌లు ధరించాలి. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
