తిరిగి సొంతగూటికి చేరిన చందుర్తి మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య
*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికలు సమీపిస్తున్న వేళా భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, చందుర్తి మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య తిరిగి సొంతగూటికి చేరాడు. తెలంగాణ ఉద్యమకారుడిగా, చందుర్తి మండలంలో కీలక నేతగా, తుల ఉమ ప్రధాన అనుచరుడిగా పేరున్న పెంటయ్య, తన అనుచరులు, అభిమానులతో కలిసి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరాడు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పెంటయ్యకు లక్ష్మీ నరసింహా రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరానని, బి.ఆర్.ఎస్ పార్టీతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరానని, నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.