*భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…
*సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి.వెంకటరత్నం..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 24:
బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధనకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల రాజీలేని పోరాటం యువతకు స్ఫూర్తి దాయకమని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం అన్నారు. సోమవారం తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా పి.వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ దేవ్ పోరాటాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వ మారణకాండను వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయక మన్నారు. స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు. నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పిడిఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్. లోకేష్ మాట్లాడుతూ నేటి యువతరం 23 ఏళ్లకే పక్కసారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. భగత్ సింగ్ మీరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికీ అందలేదన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం పిడిఎస్యు రాజీలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ పి.లోకేశ్వర్,
పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ, ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్.సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.