
లక్నేపల్లి జెడ్పిహెచ్ ఎస్ పాఠశాలలో ఓరియంటేషన్ 2024 కార్యక్రమం పరిశీలన.
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
నర్సంపేట,నేటిధాత్రి :
త్వరలో జరుగబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.శుక్రవారం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి ఓరియంటేషన్ 2024 కార్యక్రమాన్ని,బోధిస్తున్న తీరును జిల్లా విద్యా శాఖ అధికారిని వాసంతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.జనవరి 31 నుండి ఫిబ్రవరి రెండో తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని, అందులో భాగంగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో 10వ తరగతి తొలిమెట్టు లాంటిదని, విద్యార్థులు ఇష్టపడి చదివి పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ గ్రేట్ పొందేలా బోధించాలని కలెక్టర్ కోరారు.
విద్యార్థులు రాతపరమైన అంశాలను జాగ్రత్తగా ప్రజెంట్ చేసే విధంగా తగినంత సమయం నుంచి జవాబు రాసే విధానాన్ని పాటించాలన్నారు. విద్యార్థులు అత్యధిక జిపిఏ 10/10 సాధించే మెలకువలు పాటించాలని సూచించారు రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భయం, ఆందోళన లేకుండా ధైర్యంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రత్నమాల, హెడ్మాస్టర్ మాధురి, రిసోర్స్ పర్సన్స్ ఇతరులు పాల్గొన్నారు.