World’s Longest Car: The American Dream
నమ్మండి… ఇది కారేనండోయ్…
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిది. పేరు.. ‘ది అమెరికన్ డ్రీమ్’. నిజానికి ఈ కారును 1986లోనే తయారుచేశారు. కాలిఫోర్నియాకు చెందిన కార్ కస్టమైజర్ జే ఓర్బెర్గ్ దీన్ని రూపొందించారు. సాధారణ కార్లు 12 నుంచి 16 అడుగుల పొడవు ఉంటాయి. కానీ జే ఈ కారును ప్రత్యేకంగా 26 చక్రాలు, 18.28 మీటర్ల (60 అడుగులు) పొడవుతో రూపొందించారు.
అనగనగా ఓ పే…ద్ద కారు. అందులో ఒక స్విమ్మింగ్ పూల్, డైవింగ్ బోర్డ్… వెనక భాగంలో ఏకంగా ఓ హెలీప్యాడ్… ఆగండాగండి… ‘ఏంటీ కారులో ఇవన్నీ ఉన్నాయా?’ అని అవాక్కవుతున్నారా?? మీరు చదివిందంతా నిజమే.
మైఖెల్ మ్యానింగ్, మైఖెల్ డిజెర్తో కలిసి ఈ కారును కొనుగోలు చేశారు. వీరిద్దరూ దాదాపు 2.5 లక్షల డాలర్లను ఖర్చుచేసి కారుకు మరమ్మత్తులు చేయించి, లగ్జరీ సదుపాయలతో తీర్చిదిద్దారు. ఇందులో ఒక చిన్నపాటి స్విమ్మింగ్‌పూల్, బాత్ టబ్, డైవింగ్ బోర్డ్, బెడ్రూమ్స్, హెలీప్యాడ్, టీవీలు, ఫోన్, ఫ్రిజ్ వంటి సకల సదుపాయాలున్నాయి. ఇందులో 75 మందికి చోటుంది. మరో విశేషమేంటంటే ఈ కారును రెండు వైపుల నుంచీ నడపొచ్చట. అయితే పొడవురీత్యా ఈ కారును రోడ్లపైకి తీసుకురావడం కుదరదు. ప్రస్తుతం దీన్ని ఫ్లోరిడాలోని ‘డిజెర్ల్యాండ్ పార్క్కార్ మ్యూజియం’లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు.
