జనరల్లో జోష్……….!
◆:- పంచాయతీ పోరులో బీసీల హవా..
◆:- జనరల్లో భారీగా నామినేషన్లు
◆:- దొరలు, రెడ్లు హుకుంకు తలొగ్గేదెలా..
◆:- బీసీలలో పెరిగిన రాజకీయ చైతన్యం
◆:- ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న శ్రామిక కులాలు
◆:- బీసీలకు అండదండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ
◆:- రాజ్యాధికారం దిశగా నయా ట్రెండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ నేషన్ల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లైన గ్రామాల్లో ఎన్నికల సందడి జోరందుకుంటుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,735 గ్రామ పంచా యతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో బీసీలకు కేవలం 2,176 సీట్లు మాత్రమే రిజర్వేషన్లో కేటా యించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోను మిగిలిన 50% జనరల్ స్థానాలుగా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచుతామనే డ్రామా ముగిసింది. దీంతో బీసీలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ సత్తా చాటడం ద్వారా తగిన సమాధానం చెప్పాలని బీసీ సమాజం భావిస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ నయా జోష్ కనిపిస్తోంది. జనరల్ బీసీలు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. ఈసారి పంచాయతీ పోరులో బీసీల హవా. స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ స్థాయిలోని బీసీ నేతలు దూకుడు పెంచారు. జనరల్ స్థానాలన్నింటిలో పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఊరించి మోసం చేసిన కాంగ్రెస్పై, బీసీల హక్కుల విషయంపై మౌనరాగం పాటిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకు ఎన్నికల బరిలోనే తగిన సమాధానం చెప్పాలని బీసీ సమాజం నిశ్చయంతో ఉంది.
గతంలో గ్రామస్థాయిలో వెలమ దొరలు, రెడ్లు ఇతర అగ్రవర్ణాలు చెప్పిందే వేదంగా నడిచేది. తమకు ఎదురుగా తిరిగే అణగారిన వర్గాలపై ఆర్థిక బలంతో, అధికారం అండతో అణిచివేసే వారు. కాలం మారింది. రెడ్లు, వెలమలు, అగ్రకుల పెత్తందారులు హుకుంకు కాలం చెల్లిందని బీసీ యువత అంటున్నది. వారి పెత్తనా లకు తలొగ్గేదేలేదని తెగేసి చెబుతున్నది.
నగరాలు, పట్టణాల నుండి గ్రామస్థాయి వరకు బీసీలలో ఎప్పుడూ లేనంత రాజకీయ చైతన్యం పెరిగింది. జనాభాలో 60 శాతం పైగా ఉన్న మాకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని వారు తెలుసుకుంటున్నారు. జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నిస్తు న్నారు. మేమెంతో మాకు అంత వాటా దక్కాల్సిందేనని బరిగీసి నిలుస్తు న్నారు. మా ఓట్లు మాకే, మీ ఓట్లు మీకు అనే నినాదం గ్రామ స్థాయికి చేరింది. అందుకే ఆధిపత్య కులాల పెత్తనానికి ఎదురు నిలచి జనరల్ స్థానాల్లో తమ శక్తి నిరూపించాలని భావిస్తున్నారు.
బీసీలలో ఈ రాజకీయ స్పృహ పెరగటంలో సుదీర్ఘ కృషి ఉంది. బీసీలకు రాజ్యాధికారం దక్కటం ద్వారానే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుం దనే చైతన్యం పెంపొందడం వెనక బీసీల నాయకుడు మల్లన్న, ఆయన మీడియా ప్రముఖ పాత్ర వహించింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి రంగంలోనూ బీసీలు ఎలా అన్యాయానికి గురవుతున్నారో, అగ్రవర్ణాలు ఎలా ఆధిపత్యం చలాయిస్తున్నాయో లెక్కలతో సహా తెలియచెప్పటం బాగా పనిచేసింది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న నూతన పరిణామం ఏమిటంటే బీసీల ఎజెండాతో, వారికి అండదండగా తెలంగాణ రాజ్యాధికారం పార్టీ ఏర్పడటం అని చెప్పవచ్చు. తమ ఆకాంక్ష లకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడడంతో శ్రామిక కులాలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో పట్టు బిగించడమే బీసీల రాజ్యాధికారానికి మొదటి మెట్టు అని బీసీ మేధావులు చెప్తున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలు నేడు ఒక అవకాశంగా మారాయి. రాజ్యాధికారం సాధించే దిశల్లో గ్రామస్థాయిలో గెలుపు ద్వారా నయా ట్రెండ్ సృష్టించటానికి యావత్ బీసీ సమాజం సిద్ధ మవుతోంది.
