BC Journalists’ Knee Protest for 42% ReservationsBC Journalists’ Knee Protest for 42% Reservations
మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బందు పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీ జేఏసీ కి మద్దతు తెలుపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, బీసీలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీలు, వివిధ సంఘాలలో ఉన్న బీసీ లందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, తడుక సుధాకర్, శేఖర్ నాని, పాలకుర్తి మధు, తోట శ్రీనివాస్, అడ్డగట్ల శ్రీనివాస్, జగన్, క్యాతం వెంకటేశ్వర్లు తో పాటు తోటి జర్నలిస్టులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
