
BC Community Protests High Court Stay on Reservation
బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే పై బీసీ సంఘాల రాస్తారోకో
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్,బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తారోకోను శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలు వెనుక పడుతున్నారని,తెలంగాణ రాష్ట్రం లో అనేక రకమైన బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఆ మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకొచ్చారన్నారు.స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అగ్రవర్ణాలైనా రెడ్డిలు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం జరిగింది.గురువారం హైకోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపి వేశారన్నారు.తీర్పు బీసీ మెజార్టీ ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్,బిజెపి పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్రజలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించి బీసీలకు దక్కాల్సిన విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపిలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపై వచ్చి బీసీ ప్రజలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించడంలో ముందు ఉండాలని,లేనిపక్షంలో బీసీ ప్రజల ముందు మిమ్ములను దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.ఇప్పటికైనా హైకోర్టు కు అన్ని రాజకీయ పార్టీలను బీసీ రిజర్వేషన్ల పైన తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్ల ను 9 షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు.కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపి పార్టీలు బీసీల ప్రజల మనోభాలతో చెలగాటం ఆడితే రాబోవు కాలంలో రాష్ట్రాన్ని స్తంభింప చేయడం జరుగుతుందని,అగ్రవర్ణాలు కూడా బీసీలకు రావాల్సిన హక్కులకు అడ్డుపడితే తెలంగాణలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఓట్లతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్నే శ్రీధర్,ఏదునూరి రమేష్,విద్యార్థి ఉద్యమ నాయకుడు చేరాల వంశీ,బొలిశెట్టి లక్ష్మణ్,గరిగే చేరాలు,వైద్య భాస్కర్,వైద్య రవి,కట్కోజుల రమణాచారి, కంటి రవీందర్,నరసింహ చారి,రాళ్ల బండి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.