
Bathukamma Festival Begins with Engili Pula Special
బతుకమ్మ పండగ షురూ.. తొలి రోజు విశిష్టత
తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండగ.. ఈ రోజు ప్రారంభమైంది. బతుకమ్మ పండగలో భాగంగా ముఖ్యంగా గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు ఆరాధిస్తారు.
బతుకమ్మను పేర్చడానికి ముందు రోజే ఆడ వాళ్లు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ అందమై రంగు రంగుల పూలను కోసి తీసుకొస్తారు. తొలి రోజు బతుకమ్మను పేర్చి.. పూలలో ప్రధానంగా తంగేడు, గునుగు, తామర, చామంతి పూలు, బంతి పూలుతోపాటు సీత జడలను ఈ పూజలో అధికంగా వినియోగిస్తారు. తొలుత తంగేడు పూలు అమరుస్తారు. ఆ తర్వాత రంగుల ఆధారంగా ఇతర పూలను పేరుస్తారు. అయితే ముందు రోజు కోసుకొచ్చిన పూలను వాడిపోకుండా నీటిలో వేసి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఆ పూలు నిద్ర చేస్తాయి. అందుకే వీటితో అమర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా భక్తులు వ్యవహరిస్తారు.
ఈ పండగ తొలి రోజు.. పెద్దలకు, పూర్వీకులకు నివేదిన చేసిన తర్వాత.. భోజనం చేసిన అనంతరం బతుకమ్మను పేర్చడానికి పూలను సిద్ధం చేసుకుంటారు. ఇలా చేయడాన్ని సైతం ఎంగిలి పడడం అంటారు. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని చెబుతారు.
తొలి రోజు అమ్మవారికి నైవేద్యంగా..
నువ్వులు, బియ్యపు పిండి, నూకలు, తులసి ఆకులు, వక్కలను గౌరీ దేవిని నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. తొలిరోజు బతుకమ్మ ఆటపాటలు పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో తొలి రోజు.. ఎంగిలి బతుకమ్మ పండగ ముగుస్తుంది.