Comments on Atrocity Cases Insult Dalits: Sanghi Yelender
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులపై బస్వరాజు సారయ్య వ్యాఖ్యలు దళితులను అవమానించడమే: సంఘీ ఏలేందర్
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను తప్పుడు కేసులుగా చిత్రీకరిస్తూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీకి లేఖ రాయడం సమస్త దళిత సమాజాన్ని అవమానించడమేనని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ ఏలేందర్ విమర్శించారు. శుక్రవారం వరంగల్లోని తమ్మెర భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత డిసెంబర్ 24న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీకి రాసిన లేఖను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్టేవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజకీయ కక్షతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు నమోదు చేయించారని లేఖలో పేర్కొనడం ద్వారా అన్ని అట్రాసిటీ కేసులు అబద్ధాలేనన్న భావనను ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెవరు ఫిర్యాదు చేశారో, ఏ ఆధారాలపై కేసులు నమోదయ్యాయో స్పష్టంగా పేర్కొనకుండా, అన్ని అట్రాసిటీ కేసులపై విచారణ జరపాలని కోరడం సరికాదని ఆయన అన్నారు. ఇది ఎమ్మెల్సీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మీరు విమర్శిస్తున్నది మీ పార్టీ నాయకులనో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నో, లేక గతంలో విధులు నిర్వహించిన ఎస్టీ వర్గానికి చెందిన ఏసీపీని తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారా? అని సంఘీ ఏలేందర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను గమనిస్తే ఎస్సీ, ఎస్టీలు ఉన్నత పదవుల్లో ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న దురుద్దేశపూరిత ఆలోచన స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటువంటి మనస్తత్వాన్ని వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో జోక్యం చేసుకుంటే, దళితుల ఓట్ల ద్వారానే తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
