
Big Loan Boost for Jadcherla Farmers
వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.
గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.
ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
జడ్చర్ల/ నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.
పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:
జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.