MP Slams Bengaluru Traffic Management
బెంగళూరు ట్రాఫిక్‌తో ఇక్కట్లపాలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ
బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాజ్‌వాదీ ఎంపీ రాజీవ్‌రాయ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ట్రాఫిక్ జామ్‌ను సరిచేసేందుకు ఒక్క పోలీసు కూడా కనిపించట్లేదన్న ఆయన కర్ణాటక సీఎంను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు ట్రాఫిక్ పేరు చెబితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ భయపడిపోతుంటారు. తాజాగా నగర ట్రాఫిక్ నిర్వహణ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గంటకు పైగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని, పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎంను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూరుకు చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులతో ఎలాంటి ఉపయోగం లేదని, వారు బాధ్యతారాహిత్యంతో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు (Rajeev Rai Statment on Bengaluru Traffic).‘బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ చాలా దారుణంగా ఉంది. ట్రాఫిక్ పోలీసులతో ప్రయోజనం శూన్యం. కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించాను. ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గంట నుంచీ మేము రాజ్‌కుమార్ సమాధి రోడ్లోనే ఉన్నాము. ఫ్లైట్ మిస్ అయ్యేటట్టు ఉన్నాము. చుట్టుపక్కల ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కనిపించట్లేదు. బెంగళూరుకు చెడ్డ పేరు తేవడానికి ఇలాంటి అసమర్థ ఆఫీసర్లు చాలు. ట్రాఫిక్ రద్దీ వల్ల బెంగళూరుకు చెడ్డ పేరు వస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పోస్టు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు.ఇటీవల వ్యాపారవేత్త కిరణ్ మజుందార్‌షా కూడా నగర రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు వ్యోమగామి శుభాన్షూ శుక్లా కూడా బెంగళూరు ట్రాఫిక్‌పై సెటైర్లు పేల్చారు. నగర ట్రాఫిక్‌లో ప్రయాణం కంటే అంతరిక్ష యాత్ర కాస్తంత ఈజీగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే, ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా రూ.19 వేల బడ్జెట్‌తో భూగర్భ సొరంగమార్గ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
