
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనారిటీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముస్లిం మైనారిటీలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఊరేగింపుగా మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మత నాయకులు యాకూబ్ అలీ లు మాట్లాడుతూ….త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం, సేవాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. బక్రీద్ విశిష్టతలో భాగమైన ఖుర్బానీ ని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.