జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..
# 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి..
# జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు.
#పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు.
#గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం.
#ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.
నల్లబెల్లి,నేటిధాత్రి:
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి (పోచంపల్లి)లో అంగరంగ వైభవంగా జాతరను జరగనున్నది.జాతరను దిగ్విజయం చేయడం కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా ఆలయం చుట్టూ అలంకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.
బద్ది పోచమ్మతల్లి ఎక్కడి నుండి వచ్చి వెలసింది..!
బద్ది పోచమ్మ తల్లి మొదటగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దుద్యాల గ్రామంలో గల కూన వంశస్థులు ఆరాధ్య దైవంగా పూజలు చేసేవారు తదనంతరం కూన అమ్మక్క బోల్లోనిపల్లి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి నేటికీ 20 దశాబ్దాలు కావస్తుంది.నాటి నుండి నేటి వరకు గ్రామస్తులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్వాహకులు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఆకర్షించనున్న ప్రభ బండ్లు…
జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు ఆకర్షిస్తాయి.భక్తులు తమ కోరిన కోర్కెలు తల్లి తీర్చడం వల్ల భక్తులు మొక్కుబడిగా ప్రభ బండ్లు కట్టి తమ మొక్కును చెల్లించుకుంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడంతో తల్లి బద్దిపోచమ్మ పేరుతో వచ్చే అక్షరాలతో నామకరణం చేసి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే విధంగా ఆలయ ప్రాంగణంలో నామకరణం చేసి మొక్కును చెల్లిస్తారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్ల అత్యుత్సాహంతో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం పునరావృతం కాకుండా బద్ది పోచమ్మ జాతరలో పకడ్పద్దంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. జాతరలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా,రాజకీయ వాతావరణానికి తావు లేకుండా చుట్టుపక్కల గ్రామాల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలకు తావులేకుండా జాతరను సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరగా అన్ని పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.
వైభో పేతంగా బోనాలు..

ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఉగాది పండుగకు ముందు వచ్చే శుక్రవారం బద్ది పోచమ్మతల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో
ఈనెల 28 న శుక్రవారం జరిగే బద్ది పోచమ్మ జాతరకు బొల్లోనిపల్లి గ్రామంతో పాటు నల్లబెల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.ఈ క్రమంలో ప్రతి ఇంటి నుండి బోనాలతో పాటు యాటా పోతులతో బయలుదేరగా శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ తల్లిని స్మరించుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో సొంత ఊరికి చేరుకొని పిల్ల పాపలతో , బంధువులతో కలిసి పండుగను సంబరంగా జరుపుకుంటారు.
జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.
ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు , తాగునీటి,ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడికి అనుగుణంగా భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కోసం పోలీస్ శాఖను కోరడం జరిగిందని అన్నారు.