https://epaper.netidhatri.com/view/342/netidhathri-e-paper-7th-aug-2024%09
-అడుగడుగునా అఘాయిత్యాలు!
-మితిమీరుతున్న దుర్మార్గులు.
-భయం లేని మృగాళ్లు.
-పట్టింపు కరువైన పాలకులు.
-సమాజంలో పెరిగిపోతున్న దుశ్చర్యలు.
-స్కూళ్ల దాకా పాకిన దారుణాలు.
-కఠినమైన చట్టాలు తెచ్చినా భయపడడం లేదు!
-ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు.
-బస్సులో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడుతోంది.
-పెడదారి పడుతున్న యువత.
-పట్టింపు లేని తల్లిదండ్రులు బాధ్యత.
-కేవలం ప్రభుత్వం మీదనే నెట్టివేత సరైంది కాదు.
-తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తన గమనిస్తుండాలి.
-నైతిక విలువలు నేర్పిస్తుండాలి.
-సమాజంలో ఎలా బతకాలన్నది చెప్పాలి.
-చట్టాల మీద అవగాహన పెంచాలి.
-తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారికి కలిగించాలి.
-ఉత్తమ పౌరులుగా తీర్చిద్దాలి.
-స్కూళ్లలో కూడా పాఠాలే కాదు, నైతిక విలువలు నేర్పాలి.
-తోటి పిల్లలతో ఎలా వ్యవహరించాలన్నది నేర్పాలి.
-ర్యాంకులే కాదు, రాంగ్ రూట్‌లో వెల్లకుండా చూడాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
దుర్వినీత సమాజంలో దుశ్శాసన పర్వాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అడుగడుగునా అఘాయిత్యాలు నిత్యకృత్యమౌతున్నాయి. మితిమీరుతున్న దుర్మార్గుల మూలంగా సమాజంలో మహిళల భద్రత లేకుండా పోతోంది. మహిళ బైటకు రావాలంటే భయపడిపోవాల్సి వస్తోంది. ఇంతటి ఉన్నత విద్యావంతమైన సమాజంలో మహిళకు రక్షణ లేకుండా పోవడం సిగ్గు చేటు. ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా లోపాలు ఎక్కువ జరుగుతున్నాయన్నదానిపై పాలకులకు పట్టింపు లేకుండా పోతోంది. గత దశాబ్ద కాలంగా విచ్చలవిడి తనం మరింత పెరిగిపోతోంది. దేశ రాజధాని డిల్లీ నగరంలో 2014లో జరిగిన నిర్భయ ఘటన మన చట్టాల డొల్ల తనాన్ని ప్రశ్నించినట్లైంది. ఒక రకంగా సవాలు చేసినట్లైంది. మగాళ్లు మృగాళ్లుగా మారి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పాలకులకు పట్టింపు కరువౌతోంది. దాంతో సమాజంలో దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. తెలిసీ తెలియని పసి గుడ్డులను చిదిమేంత రాక్షసత్వం పెచ్చు మారిపోవడంతో సమాజం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇదిలా వుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలో కూడా కొంత మంది నిర్వాకం మూలంగా నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. విచారణ పేరుతో షాద్ నగర్ పోలీసు స్టేషనులో ఇటీవల జరిగిన సంఘటనతో రక్షకులెవరో, భక్షకులెవరో అర్థం కాని పరిస్థితి ఎదురౌతోంది. చట్టాల మీద అవగాహన వున్న పోలీసులకు కూడా వాటి మీద గౌరవం లేకపోవడం విడ్డూరం. తాజాగా జనగామ జిల్లా పోలీసు స్టేషనులో మహిళా న్యాయవాదిపై పోలీసు అధికారులు చేయి చేసుకున్నారన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా న్యాయవాదినే పోలీసు స్టేషనులో దాడి జరిగిందంటే సమాధానం చెప్పేవారేరీ! మరో వైపువ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. బస్సులో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడుతోంది. అయితే యువత పెడదారిలో పడడాన్ని పాలకులను తప్పు పడితే సరిపోదు. పట్టింపు లేని తల్లిదండ్రులు కూడా ఇందుకు బాధ్యులే. జరిగే సంఘటనలపై కేవలం ప్రభుత్వం మీదనే నెట్టివేత సరైంది కాదు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తుండాలి. అలాగే వారికి నైతిక విలువలు నేర్పిస్తుండాలి. సమాజంలో ఎలా బతకాలన్నది చెప్పాలి. అంతే కాకుండా చట్టాల మీద అవగాహన పెంచాలి. తల్లిదండ్రులు కూడా చట్టాల మీద మరింత అవగాహన పెంచుకోవాలి. సమాజ తీరు తెన్నులను పిల్లలకు తెలియజేస్తుండాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారికి కలిగించాలి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలనే తపన తల్లిదండ్రులకు కూడా వుండాలి. అందుకు అనుగుణంగా వారిని తీర్చిద్దాలి. ఇక పాఠశాలలో కూడా పాఠాలే కాదు, నైతిక విలువలు నేర్పాలి. తోటి పిల్లలతో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.క్లాస్ రూములలో పాఠాలతో పాటు నైతికపాఠాలు కూడా చెప్పాలి. పిల్లలకు ర్యాంకులే కాదు, రాంగ్ రూట్‌లో వెల్లకుండా చూడాలి.
మహిళలు అర్థరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మా గాంధీ చెప్పి కొన్ని దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అంటే అప్పటి రోజులు ఇప్పటికన్నా ఎంతో మేలని అనుకోకతప్పదు. ఇంతటి విద్యా వంతమైన సమాజంలో కూడా ఒక మహిళ పట్ట పగలు కూడా రోడ్డు ఒంటరిగా వెళ్లలేని దుర్భర పరిస్థితులు ఇంకా పెరిగిపోతున్నాయి. అదేదో సినిమాలో అన్నట్లు ఒక మహిళ నిత్యం కొన్ని వందల కామపు కళ్లను తప్పించుతిరగాల్సిన దౌర్భాగ్యపు రోజుల్లో దిక్కు మాలిన బతుకు అనుభవిస్తున్నాం. జంతువులన్నా హీనంగా బతుకుతున్నాం. ప్రకృతిలో ఏ జంతువు ఇంత కట్టు బానిసత్వానికి అనుభవించడం లేదు. వాటికున్న స్వేచ్ఛ మనకు లేకుండా పోతోంది. జంతువులు అడవులలో కూడా నిర్భయంగా సంచరిస్తుంటాయి. కానీ మన మహిళలు సభ్య సమాజంలో ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారు. అడుగడుగునా మృగాల మధ్య తల దించుకొని వెళ్లాల్సివస్తోంది.
ఒంటరిగా ఒక మహిళ బైటకు వెళ్లాలంటే ఇంతగా భయపడాల్సిన పరిస్థితుల మీద పాలకులకు పట్టింపు లేదు. సమాజానికి బాధ్యత లేదు. సమాజంలో రోజు రోజుకూ పెరిగి పోతున్న దారుణాలను చూసి దిగ్భ్రాంతికి గురౌతున్నారు. ఒక మహిళ తన ప్రాణం కన్నా అభిమానాన్ని నిండా కప్పుకొని బిక్కుబిక్కు మంటూ కాలం గడపాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. 2014 లో దేశ రాజధాని డిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నుంచి మొదలు, తెలంగాణలో దిశ ఘటన తర్వాత కూడా కొన్ని వందల అగాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. మహిళల వంక చూస్తే కనుగుడ్లు పీకేస్తామని ప్రగల్భాలు పలికిన కేసిఆర్ కూడా వ్యవస్థను మార్చలేకపోయారు. ఆడ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఫోక్సో లాంటి కేసులు నమోదు చేస్తామంటున్నా ప్రజల్లో భయం కనిపించడం లేదు. దారుణాలు ఆగడం లేదు. ఇలాంటి దుష్ట దుర్మార్గపు పనులు దేవాలయం లాంటి విద్యాలయాలకు కూడా పాకడం సమాజంలో సిగ్గుతో తలదించుకోవాలి. గత ఏడాది హైదరాబాదు లోని ఓ ప్రైవేటు స్కూల్ లో డ్రైవర్ చేసిన పనికి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మీడియా కొంత కాలం హడావుడి చేసింది. మహిళా సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. సభలు, సమావేశాలు, ధర్నాలు చేశాయి. మర్చిపోయాయి. తర్వాత ప్రభుత్వం కూడా మర్చిపోయింది. మళ్ళీ ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. ఇందులో పాఠశాల యాజమాన్యానిది ఎంత తప్పు వుందో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా అంతే వుంది.
ఏ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఆరా తీసి మరీ తల్లిదండ్రులు ఆ స్కూళ్లలో తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్న మోజులో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా చదివిస్తున్నారు. కానీ ఆ స్కూల్ ఎలా వుంది. దాని యాజమాన్యం ఎవరు? టీచర్లు ఎలాంటి వాళ్లు. ఆ స్కూళ్లు సామాజిక బాధ్యత ఎంత నిర్వహిస్తున్నాయి. విద్యా బుద్దులు నేర్పుతున్నారా! కనీసం అద్భుతమైన విద్యా బోధన జరుగుతుందా? పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పుతున్నారా! సమాజం మీద అవగాహన కల్పిస్తున్నారా! అమ్మాయిల విషయంలో యాజమాన్యం ఎంత బాధ్యతగా వుంటున్నారు. పిల్లలకు అమ్మాయిల పట్ల ఎంత గౌరవంగా వుండాలో నేర్పుతున్నారా! ఇవన్నీ తల్లిదండ్రులుకు అవసరం లేకుండా పోతోంది. ఫీజులు చెల్లిస్తున్నామా? ర్యాంకులు వస్తున్నాయా! అంతంత ఫీజులు చెల్లించినా చదువు సరిగ్గా రావడం లేదని ట్యూషన్లు పెట్టిద్దామా? ఇంత వరకే తల్లిదండ్రులు ఆలోచనలు సాగుతున్నాయి. అసలు పిల్లలు స్కూళ్లలో ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎవరితో స్నేహం చేస్తున్నారు. స్కూల్ అయిపోగానే నేరుగా ఇంటికి వస్తున్నారా? వచ్చిన తర్వాత పుస్తకాలు పక్కన పడేసి సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు? వారి వారి గదులలో తలుపులు వేసుకొని చదువుకుంటున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? ఇవేమీ తల్లిదండ్రులకు పట్టింపు వుండడం లేదు. ఇక స్కూళ్లలో యాజమాన్యాలకు ప్రభుత్వాలు జారీ చేస్తున్న ఆదేశాలేమిటి? అన్నది కూడా అవగాహన లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం పిల్లల విషయంలో ముఖ్యంగా ఆడ పిల్లలకు సంబంధించిన అనేక జాగ్రత్తలపై అనేక ఆదేశాలున్నాయి. వాటిని పట్టించుకుంటున్నాయా? వాటిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందా? అదీ లేదు. మొత్తంగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పిల్లల మధ్య ఎలాంటి సుహృద్భావమైన వాతావరణం వుండాలో విస్మరిస్తున్నారు. స్కూళ్లలోకి కూడా డ్రగ్స్ వస్తున్నాయన్న విషయాలు తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించే స్కూళ్లు, కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలి. యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలి. ప్రతి తల్లిదండ్రులకు కూడా స్కూళ్లలో ప్రతి నెల కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. పొరపాట్లు జరక్కుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో మహిళా కమిషన్ కూడా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తు తరానికి మంచి మార్గం వేయాలి.