చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు కూలీ పనులు చేస్తూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. వాళ్ళు పడే కష్టాలను సైతం ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని జీవితంలో మీరు స్థిరపడాలని ఆయన సూచించారు. మీకోసం మీ తల్లిదండ్రులే కాకుండా మేము కూడా తపన పడుతున్నామని, మీరంతా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని

కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు మీకోసం ఇంజనీరింగ్, నీట్ ఎంట్రెన్స్ పరీక్షలకు క్రాష్ కోర్స్ ఏర్పాటు చేస్తామని.. ఈ కోర్సులో చేరిన వారికి ఉచితంగా వసతి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పాపిరెడ్డి శుక్రవారము పదవీ విరమణ సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి ఆల్ ది.. బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.