
Sufficient fertilizers
100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.
జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు
ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏ.ఎం.సీ చైర్ పర్సన్, డీఏఓ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయగా, శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువులు కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 100 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని తెలిపారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు. జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సివస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.