Auto Drivers Hit by Jatara Restrictions
అడ్డా లేక ఆగమగుతున్న ఆటో డ్రైవర్లు.???
ఐలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఆటో స్టాండ్ ఖాళీ చేయించిన పోలీసులు
అసలే ఉచిత బస్సుతో డీలాపడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు
మండలంలో మల్లికార్జున స్వామి జాతరే వారికి దిక్కు
జాతర లోపలికి లోకల్ ఆటోలను సైతం అనుమతించని పోలీసులు
తమ బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దని వేడుకున్నా కనికరించని పోలీసులు
భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారం ముఖ్యమే.
జాతర నిర్వహణ పేరుతో పేదల బతుకులపై బండలు వేస్తారా??
ఇన్నేళ్లు సజావుగా సాగినా ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి???
నేటి ధాత్రి అయినవోలు :-
ఐలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఈసారి జాతర వాతావరణం కంటే ఆటో డ్రైవర్ల ఆవేదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సజావుగా సాగిన ఆటో వ్యవస్థను ఒక్కసారిగా తుడిచిపెట్టినట్లుగా పోలీసులు తీసుకున్న నిర్ణయాలు స్థానిక ఆటో డ్రైవర్ల బతుకుదెరువును ప్రశ్నార్థకంగా మార్చాయి.ఆలయం పరిసరాల్లో ఉన్న ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయిస్తూ, లోకల్ ఆటోలను జాతర ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో డ్రైవర్లు అడ్డా లేకుండా అల్లాడిపోతున్నారు. అసలే ఉచిత బస్సుల విధానంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిన వేళ, ఏడాదిలో ఒక్కసారైనా మల్లికార్జున స్వామి జాతరే తమకు దిక్కు అనుకున్న ఆటో డ్రైవర్లకు ఇది తీరని దెబ్బగా మారింది.జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం నిజమే. కానీ అదే పేరుతో స్థానిక ఆటోలను పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఆటోలు నడిచినప్పుడు, ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి
“మా బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దు… కనీసం జాతర రోజుల్లో అయినా మాకు ఉపాధి దొరికేలా చూడండి” అంటూ ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నా, పోలీసులు మాత్రం కనికరించని వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రత పేరుతో తీసుకునే నిర్ణయాలు ప్రజల ఉపాధిని హరించేలా ఉంటే, అది పాలన వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుంది.
జాతర నిర్వహణకు క్రమశిక్షణ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. కానీ దానికి పరిష్కారం స్థానికుల జీవనాధారాలను మూసివేయడం కాదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయించి, లోకల్ ఆటోలను నిషేధించడం పోలీసు యంత్రాంగం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారాన్ని కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిది. అసలే ఉపాధి లేక చీటికి చినిగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకులపై ఈ భారం పడకుండా స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ చొరవ తీసుకోవాలి.లేదంటే “జాతర” పేరు చెప్పుకుని “ పేద ప్రజల బతుకులపై బండలు వేసిన” చరిత్రగా ఈ నిర్ణయం మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
