తెలంగాణకు గుండెకాయ సింగరేణి
సిపిఐ జిల్లా సమితి సభ్యులు రమేష్ ప్రవీణ్
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేయడాన్ని వెంటనే విరమించుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ లు డిమాండ్ చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బొగ్గు గనుల ప్రైవేటు కరణ, బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే 60 సింగరేణి బ్లాకులను వేలం వేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోశ్రావనపల్లి ఓసి ని వేలం వేయడానికి సిద్ధపడిందని ప్రైవేటీకరణ సింగరేణి మనుగడకు గొడ్డలి పేట్ లాంటిదని అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. ఉత్తర తెలంగాణకే గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బొగ్గు గనుల ప్రైవేటు కరణ చేయనని చెప్పిన బిజెపి ప్రభుత్వం అత్యంత స్పీడుగా గనులను వేలం వేయడానికి సిద్ధపడిందని వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న ప్రైవేటీకరణ అడ్డుకోవడం లేదని విమర్శించారు. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు పరం చేస్తే సింగరేణిలో ప్రమాదంలో పడబోతుందని అన్నారు. ఇలాంటి ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్న సింగరేణి సంస్థను రక్షించుకోవాలని కోరారు. సింగరేణి కి నూతన గనులు రాకుంటే 5 సంవత్సరాల్లోనే సింగరేణి మూతపడే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన గనులకు పర్మిషన్ ఇచ్చి బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా రాబోయే భవిష్యత్ తరాలకు ఉద్యోగులకు జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని విరమించుకోకుంటే రాబోయే రోజుల్లో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అందించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతర సతీష్, నేరెళ్ల జోసెఫ్, శ్రీకాంత్, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఆసిఫ్ పాషా, బ్రాంచ్ కమిటీ సభ్యులు రవికుమార్, నూకల చంద్రమౌళి, ఫిట్ సెక్రటరీలు ఎల్ శంకర్, పి శ్రీనివాస్, దోర్నాల తిరుపతి, ఎం రమేష్ ఎండి కరీముల్లా సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.