ఎస్సీ, ఎస్టీలపై దాడులు సహించం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల బ్యాగరి రాములు ఇంటి కూల్చివేత ఘటనపై స్పందిస్తూ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య బాధితుడికి రూ.25,000 పరిహార చెక్కును అందజేశారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన ఆయన, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆయన ఖండించారు. బాధితులకు అండగా నిలవాలని, స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టే చర్యలను సహించబోమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆర్డీవో దేవుజా, పలువురు అధికారులు, సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
