
vAsian Indian Phenotype & Diabetes Risk
ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్.. షుగర్ వ్యాధికి ఇదీ ఓ కారణమని తెలుసా..
భారత్‌లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇందుకు గల కారణాల్లో భారతీయుల శరీర తత్వం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ శరీర తత్వం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో షుగర్ వ్యాధి ఉన్న వారి సంఖ్య ఏకంగా 100 మిలియన్లు. ఫలితంగా భారత్‌కు ప్రపంచపు డయాబెటిక్ రాజధాని అనే పేరు వచ్చిపడింది. ఇలా ఎందుకు అని శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. చక్కెర అధికంగా ఉండే స్వీట్స్ తినడమే ఇందుకు కారణమని మొదట్లో అనుకున్నారు. అయితే, భారతీయుల ప్రత్యేక శరీర తత్వం కూడా ఇందుకు ఒక కారణమని క్రమంగా అర్థమైంది.
భారతీయులకు ఉండే ప్రత్యేక శరీర తత్వాన్ని ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్ అని వైద్యులు పిలుస్తారు. భారతీయుల్లో పొట్ట చుట్టు కొవ్వు పేరుకోవడం ఎక్కువ. స్లిమ్‌గా కనిపించే వారిలోనూ పొట్ట చుట్టు కొవ్వు ఎక్కువగానే ఉంటుంది. పాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే భారతీయుల్లో కండరాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ఇతర దేశాల వారితో పోలిస్తే చిన్న వయసులోనే భారతీయుల్లో ఇన్సులీన్ ప్రభావం తగ్గడం ప్రారంభం అవుతుంది.
ఇక తల్లిదండ్రుల్లో ఎవరికి డయాబెటిస్ ఉన్నా పిల్లలకు ఈ వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇప్పటికే అనేక కుటుంబాల్లో డయాబెటిస్ ఉన్న పిల్లలు ఉన్నారు. దీనికి తోడు నేటి జీవనశైలి ఆహారపు అలవాట్లు అన్నీ డయాబెటిస్ ముప్పును పెంచుతున్నాయి. ఇందులో జీవనశైలి మార్పులే డయాబెటిస్ ముప్పు పెరగడానికి ముఖ్య కారణం.
సుదీర్ఘ పని గంటలు, కూర్చీల్లోంచి కదలకుండా గంటలకు గంటలు గడిపేయడాలు, ఇంటికి ఆఫీసుకు మధ్య ఎక్కువ సేపు జర్నీలు చేయాల్సి రావడం వంటి వాటి కారణంగా జనాలకు ఎక్సర్సైజులు చేసేందుకు తీరికే ఉండట్లేదు. ఫలితంగా పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుని డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. భారతీయుల వంటకాల్లో చక్కెరలు అధికంగా ఉండటం మరో రిస్క్ ఫ్యాక్టర్. ఒత్తిడిమయ జీవితం, నిద్ర లేమి వంటివన్నీ షుగర్ వ్యాధి ముప్పును అంతకంతకూ పెంచుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని వారికి 40 ఏళ్లు, లేదా 50 ఏళ్లకు డయాబెటిస్ మొదలవుతుంటే భారతీయుల్లో కొందరికి 20ల్లోనే షుగర్ వ్యాధి మొదలవుతోంది. ఈ వ్యాధి ముప్పును తగ్గించేందుకు, రోగాన్ని అదుపులో పెట్టుకునేందుకు కసరత్తులు, జీవనశైలి మార్పులకు మించినది లేదని నిపుణులు చెబుతున్నారు.