-నేను చెప్పినప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి.
-తెలంగాణలో బెన్‌ఫిట్, ప్రీమియర్ షోలు లేనట్లే!
-సామాజిక బాధ్యత విస్మరిస్తే తాట తీస్తాం.
-చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే చీరి చింతకు కట్టుడే
-తిక్కవేషాలేస్తే తొండలు జొర్రగొట్టుడే.
-సినీ గద్దలకు సిఎం స్ట్రాంగ్ వార్నింగ్.
-అల్లు అర్జున్ గీత దాటాడు.
-చట్టం ముందు అందరూ సమానులే.
-రాజ్యానికి ఎదురుతిరిగితే ఎవరికైనా ఇదే గతే.
-సిఎం పంతం నెగ్గి…సినిమా పెద్దలు తగ్గి!
-నోరెత్తని హీరోలు, దర్శకులు.
-ప్రభుత్వ కార్యాలయాలు ప్రచారం చేయాలి.
-తెలంగాణ అభివృద్ధిని చూపించాలి.
-పిలిచి మరీ వెదవలను చేశారని లోలోన ఆక్రోశం.
-సినీ పెద్దలలో కనిపించిన అసహనం.
-ఎగేసుకుంటూ వెళ్లడంపై గొణుక్కుంటూ జారుకున్నారు.
-రాజ్యం ముందు తలెగరేస్తే దించుకోవాల్సిందే అని తెలుసుకున్నారు.
-హీరోలు జీరోలైపోయారు. తెలంగాణ దెబ్బ రుచి చూశారు.
-మీ పని మీరు చేసుకోండి..ఇతర విషయాలపై వేలు పెట్టడం మానుకోండి.
-సినిమా విషయంలో ఏది జరిగినా బాధ్యులు మీరే.
-ఒళ్లు దగ్గర పెట్డుకొని ఉండండి.
-నోరు మెదపలేకపోయిన సినిమా గద్దలు.
-రెండు గంటల పాటు అంతా సైలెన్స్.
హైదరాబాద్,నేటిధాత్రి:
మేం వేరు..మా బ్లడ్ వేరు..మేము అభిమానుల పాలిట దేవుళ్లం. అద్దాల మేడలోవుంటాం. మేమొస్తున్నామంటే పోలీసులు కూడా కాపలా కాయాల్సిందే.. పడిగాపులు కాయాల్సిందే..ప్రభుత్వాలు వణకాల్సిందే. సెలెబ్రిటీలంటే మేమే..మా ముందు ఎవరైనా జుజుబీయే..మేం కనుసైగ చేస్తే అభిమాన ఆర్మీలు కదులుతాయి. ఎంతటి వారి కూసాలైనా విరుగుతాయి. ప్రభుత్వాలు మాకో లెక్కనా..మేం ఎవరు కావాలనుకుంటే వారే పాలకులౌతారు. మా రాకతోనే నాయకులకు కూడా కలొస్తుంది. సభలకు బలమొస్తుంది. నాయకులకు గెలుపొస్తుంది. మేం అన్నిటికీ అతీతలం..ఇదీ సినీ జనం ఒకప్పటి మాట…కాలం మారింది. రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. సినీ చరిత్రలో మొదటిసారి సినీ లోకం గజగజ వణుకుతోంది. ప్రభుత్వం పేరు వింటేనే వారి వెన్నులో చలి మొదలౌతోంది. మేం వేరు అనుంటే వేర్లతో సహా పెకలించే నాయకుడు వచ్చాడు. అటు వంటి పాలకుడిని చూస్తున్నాం. ఈక జాడిస్తే తోక కత్తిరించే ముఖ్యమంత్రి వున్నారు. ఉడుత ఊపులు ఊపితే తొండలు జొర్రించేలా వున్నాడు. అని ఇప్పటిదాకా దైవాంశ సంబూతులమన్న భ్రమల్లో తేలియాడుతున్న వారి జీవితాల్లో మొదటిసారి భయం అంటే ఏమిటో రుచి చూపించిన ఏకైక పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. భయం అంటే ఏమిటో సినీ రంగానికి రుచి చూపించడమే కాదు, ఇక్కడ టన్నులు టన్నులుంది అని గజ్జున వనికిస్తున్నాడు. కలలో కూడా రేవంత్ రెడ్డి పేరు కలవరించేలా చేస్తున్నాడు. కంటి మీద కునుకే లేకుండా కాళరాత్రులు చూపుతున్నాడు. సినిమా పేరుతో తెలంగాణను దోచుకొని, అభిమాని కుటుంబం తొక్కిసలాటకు బలి చేసిన అల్లు మీద కన్నెర్ర చేయడంతో సినీ పెద్దలు ఒక్కసారికి ఉలికిపాటుకు గురయ్యారు. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి రావడానికి భయపడిపోయాడు. అల్లు అర్జున్ స్వయంగా బావమరిది కొడుకు. తన ఇంట్లో పెరిగాడు. అలాంటి అల్లు అర్జున్ కేసుల్లో ఇరుక్కుంటే ఓదార్పుతోనే సరిపెట్టాడు. తలదూర్చేందుకు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. స్టార్లు, మెగాస్టార్లు ఎంత మంది వచ్చినా జరిగిన తప్పును సరిదిద్దే పరిస్దితి లేదు. ఒక వేళ వచ్చినా పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు. పెద్ద మనిషి తరాహా వ్యవహారం కూడా వుంటేనే అప్పుడు సార్ధకమౌతుంది. ఒక మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్‌నే ఇంత వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇరవై రోజులు తర్వాత గాని ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు తీరిక దొరకలేదు. ఇతర సినీ పెద్దలకు మనసు రాలేదు. ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఇష్టం లేని చూపులు చూస్తున్నారు. మీడియా ముందు ఫోజులు కొడుతున్నారు. ఎప్పుడైతే మంత్రి కోమటి రెడ్డి వెళ్లి తన ట్రస్టు ద్వారా అబ్బాయి కుటుంబానికి 25వేల చెక్కు అందించిన తర్వాత సిగ్గు తెచ్చుకున్నారు. గత పదిహేను రోజుల క్రితం సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత 25లక్షలు అందిస్తామని చెప్పి పది లక్షలిచ్చి అల్లు అర్జున్ చేతులు దులుకున్నాడు. ఈ సంగతి స్వయంగా మృతి చెందిన మహిళ భర్త చెప్పడంతో సమాజమంతా అల్లు అర్జున్‌ను, చీచీ అన్నది..తూతూ అని ఉమ్మేసింది. అప్పుడు నిర్మాతలను పంపి 50లక్షల చెక్ ఇప్పించాడు. తర్వాత అల్లు అరవింద్ వచ్చిన మరో కొత్త కథ చెప్పాడు. ట్రస్టు ఏర్పాటు చేసి, నిర్మాతల సొమ్ముతోపాటు రెండు కోట్లతో బ్యాంకులో జమ చేస్తామని చెక్కులు కూడా చూపించకుండా జారుకున్నాడు. ఇంత తంతు జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? తన దొడ్లోకి అందర్ని పిలిపించుకున్నాడు. పిచ్చ క్లాస్ పీకి పంపించాడు. సినిమా పెద్దలుగా చెలామాణి అవుతున్న వారికి చెమడల్ తీస్తానని తనదైన స్టైల్‌లో సిఎం. రేవంత్ రెడ్డి సినిమా చూపించారు. రెండు గంటల పాటు సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు బుద్దిగా కూర్చునేలా చేశారు. ఇక అప్పుడు తన విశ్వరూపం చూపించాడు. తాను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన ప్రతి మాటకు తాను కట్టుబడి వుంటానని ముఖ్యమర్రతి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇకపై రెగ్యులర్ షోలు మాత్రమే వుంటాయాన్నారు. సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరల పెంపు వుండదన్నారు. రేట్లు పెంచుకునే అవకాశాలు ఇవ్వడం కుదరదన్నారు. ప్రీమియర్ షోలు, బెన్‌ఫిట్ షోలకు తావులేదన్నారు. ప్రభుత్వం ఎంతో సహృదయంతో ఇచ్చిన జీవోలను అతిక్రమించి, ఒకమహిళ చినిపోవడానికి కారణమై, కూడా పశ్చాత్తాపం లేని సినిమా వర్గాలు కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడం జరగదన్నారు. సినిమాలు విడులైన తర్వాత హీరోలు చేసే హంగామాలకు పర్మిషన్లు ఇవ్వడం జరగదన్నారు. హీరోలు ఎక్కడికి వెళ్లినా, ఏదైనా సమస్యలు ఎదురైనా, సంఘటనలు జరిగినా బాధ్యత వాళ్లే వహించాలని సూచించారు. ఇక బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని లేని పోని రాద్దాంతాలు చేసినా, ప్రజలకు అసౌకర్యం కల్గించినా క్షమించేది లేదని తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా ఎలాంటి దురుద్ధేశం లేని, పోలీసులు చెప్పినా వినకుండా ఆయన సంధ్య ధియేటర్‌కు వెళ్లడం తప్పన్నారు. అంటి సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ చూపిన నిర్లక్ష్యాన్ని చట్టం సహించదని గుర్తు చేశారు. పెద్దఎత్తున వేలాది మంది అభిమానులు చేరుకుంటున్నారని తెలిన వెంటనే పోలీసులు అల్లు అర్జున్‌ను రావొద్దని హెచ్చరించిన వచ్చి హంగామా చేయడం వల్లనే దురదృష్ట సంఘటన జరిగింది. పోలీసుల సూచనలు బేఖాతరు చేసినందునే బన్నీ మీద కేసులు నమోదు చేయడం జరిగిందన్న సంగతిని మరోసారి సిఎం. స్పష్టంచేశారు. జరిగిన సంఘటనపై సినీమా పెద్దలకు మరోసారి వీడియోలు చూపించి న్యాయం మీరే చెప్పండి? అని వారికి సూచించినట్లు తెలుస్తోంది. అప్పుడు సినిమా పెద్దలంతా ఏం మాట్లాడలేదని సమాచారం. అంతే కాకుండా పోలీసులదే తప్పన్నట్లు, ప్రభుత్వం మీద నెపం నెట్టేసే ప్రయత్నం పదే పదే చేయడాన్ని ఎవరూ సహించరు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. చట్టమంటే అందరికీ భయం కూడా వుండాల్సింది. సెక్యూరిటీ ఇస్తున్నారని పోలీసులను చులకన చేయడానికి సినిమా కాదని అన్నట్లు కూడా తెలుస్తోంది. సినిమా అంటే వినోదంగా వుండాలి. లేదా సందేశాత్మకంగా వుండాలి. అంతే కాని వ్యవస్ధను కించపర్చేలా, యువతను తప్పుదోవ పట్టించేలా వుండొద్దని సూచించినట్లు కూడా సమాచారం. ఇకపై సినీ రంగం తప్పకుండా తమ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలని సిఎం. సూచించారు. సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సినీ రంగం కూడా కృషి చేయాలన్నారు. యువత డ్రగ్స్ లాంటి మహమ్మారి బారిన పడి జీవితాలను బలి చేసుకుంటున్నారు. సినిమాల్లో చూపి వాటిని అనుసరిస్తున్నారు. అనుకరిస్తున్నారు. వాటి బారిన పడుతున్నారు. ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేషాలు లేకుండా చూసుకోవాలి. అంతే కాకుండా గంజా, డ్రగ్స్, మద్యం సేవనాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు రావాలన్నారు. సినిమా నిర్మాణాల పరంగా ఎక్కడా ఇబ్బంది వుండదు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బొంబాయిని మించి సినిమాలు నిర్మాణం చేసుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాము. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే ముందుకు సాగుతున్నాము. వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి ప్రత్యేకమైన అభిప్రాయాలు లేవు. వ్యక్తిగత ఇస్టాఇస్టాలకు ఎలాంటి తావులేదు. తెలుగు సినీ పరిశ్రమ తెలుగుకే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా వుంటుంది. అండగా వుంటుంది. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం వుంటుందని సిఎం. చెప్పారు. అయితే సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతలను కర్తవ్యంగా తీసుకోవాలి. సమాజాభివృద్దికి తోడ్పాడునందించాలి. సామాజిక రుగ్మతల మీద సినిమాలు రావాలి. వాటిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుక సినీ పరిశ్రమ ముందుకు రావాలి. యువతకు మంచి మార్గం చూపే సినిమాలు రావాలి. సినీ పెద్దలకు సిఎం. సూచించారు. సమావేశం ముగించారు. దాంతో బాలకృష్ణ సినిమాలో మొదటిసారి ఒక సింహాన్ని చూశాను సార్ అని చలపతి రావు అన్నట్లు, ఇంత కాలానికి ఒక ధైర్యవంతుడైన సిఎంను చూసి సినీ పెద్దలు జడుసుకున్నారు.