వర్ధన్నపేటలో ఎదురులేదు, ప్రచారంలో దూసుకెళ్తున్న ఆరూరి
వర్ధన్నపేట గడ్డ, ఆరూరి అడ్డా హాట్రిక్ విజయం పక్కా
దేశంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేరు
పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండే? ఇప్పుడు తెలంగాణ ఎలా వుంది? అన్నది ప్రజలు ఆలోచించాలి
___జిల్లా అధికార ప్రతినిధి, అంబాల ఉదయ్ కిరణ్ రిటైర్డ్ డిఎస్పీ
వర్ధన్నపేట, నేటిధాత్రి
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా శనివారం రోజున నియోజక వర్గంలో పార్టీ అధికార ప్రతినిధి అంబాల ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 43వ డివిజన్ పరిధిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ ఆరూరికి అండగా వర్ధన్నపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మూడోసారి హాట్రిక్ విజయం సాధించడంతో పాటు, లక్ష ఓట్ల మెజారిటీతో భారీ గెలుపు ఉంటుందని తెలిపారు. వర్ధన్నపేటలో ఆరూరి గెలుపుకోసం మేమందరం కలిసి పని చేస్తున్నామని, వర్ధన్నపేట గడ్డ, ఆరూరి అడ్డా అని తెలియచేశారు, తాను మూడు సంవత్సరాల క్రితం, డిఎస్పీగా రిటైర్డ్ అయిన తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేరు అని, ఆయన పాలనలో సంక్షేమ తెలంగాణ రూపుదిద్దుకున్నదని, ఒకనాడు చినుకుకు ఏడ్చిన తెలంగాణ ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణగా మారిందని, ముఖ్యంగా వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆశీర్వదించిన కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని, తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, తెలంగాణకు బతుకు లేకుండా చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో వర్ధన్నపేట నుండి ఆరూరి రమేష్ భారీ విజయాన్ని అందుకోబోతున్నారని తెలిపారు. వర్ధన్నపేట ప్రజలందరు కారు గుర్తుకు ఓటేసి ఆరూరికి అండగా ఉండాలని పిలుపిచ్చారు..