పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం రోజున స్వామి వారి ఆరుద్ర నక్షత్రం, ఎంతో విశిష్టమైన సంకష్టహర చతుర్థి న 108 లీటర్ల ఆవుపాలతో ఆరుద్రోత్సవం, పుష్పార్చన అత్యంత వైభవంగా, కన్నుల పండుగ వలే నిర్వహించారు. అంతకు ముందు గణపతి పూజ, కలిశ పూజ అర్చకులు శాస్త్రోత్తంగా నిర్వహించారు. 42 కలిశాలతో భక్తులు సోమేశ్వరుడికి జలాభిషేకం, 108 ఆవుపాలతో అభిషేకాలు నిర్వహించి, శివలింగానికి పుష్పాలతో అలంకరించి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో ద్వీపకాంతులతో సోమేశ్వరుడు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చాడు. కార్తీకమాసం శివునికి ప్రీతికరమైన మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరవ్వగా హరనామ కీర్తనలతో సోమేశ్వరాలయం మార్మోగింది. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డి వి ఆర్ శర్మ, దేవగిరి అనిల్ శర్మ, దేవగిరి సునీల్ శర్మ, దేవగిరి రామన్న శర్మ పాల్గొన్నారు.