లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏరుపాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాటు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య మరియు ఇతర ఏర్పాటు పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు సౌకర్యాలు వంటి తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ స్థలాన్ని గుర్తించి వాహనాలు క్రమబద్దీకరణకు సైనేజి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పనిచేసి భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు, అర్చకులు దేవాలయ సంప్రదాయం ప్రకారం జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందచేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ బోనాల కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్,
ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, ఆలయ ఈవో మహేష్ ఆలయ కమిటీ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.