బస్సు షెల్టర్ లు ఏర్పాటు చేయండి సారూ

ఆర్కేపి అంటే అధికారులకు, నాయకులకు చులకనేనా…?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. మహిళలలు బస్సులలో ప్రయాణించాలంటే ముందుగా వారు ప్రయాణించే ప్రాంతాలలో బస్సు షెల్టర్లు ఉండాలి, కానీ అందుకు భిన్నంగా రామకృష్ణాపూర్ పట్టణంలో ఎక్కడ చూసినా బస్సు షెల్టర్ లేక మహిళలు, ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
రామకృష్ణాపూర్ పట్టణం నుండి బెల్లంపల్లి, గోదావరిఖని ఏరియాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సులలో, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తుంటారు కానీ ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడ కూడా బస్సు షెల్టర్లు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ లు ఉన్నా సరే అవి నిరుపయోగంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేపి అంటే అధికారులకు, నాయకులకు చిన్నచూపేనా ..? అని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.ఇక మంచిర్యాలకు అయితే బస్సు సౌకర్యం లేక కొన్ని సంవత్సరాలే గడుస్తోంది.బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాలలో బస్ షెల్టర్ లు లేవు.పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్ నిరుపయోగంగా,శిధిలావస్థలో ఉండడంతో ప్రయాణికులంతా రోడ్డు పక్కననే నిలబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ చౌక్ వద్ద ఉన్న బస్ స్టాండ్ రోడ్డుకు దూరంగా ఉండటంతో బస్సులు,ప్రైవేట్ వాహనాలు అటు వైపుకు వెళ్ళని కారణంగా ఆ బస్ స్టాండ్ షెట్టర్స్ ను మున్సిపాలిటీ అధికారులు అద్దె ప్రాతిపదికన అద్దెకు ఇవ్వడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ అట్టి బస్ స్టాండ్ లో ఉన్న షట్టర్స్ ను కాళీ చేయించి ప్రయాణికులకు అనువుగా ఉంచి బస్సులు నడిపిస్తే రాత్రి వేళల్లో బస్సు స్టాండ్ లో ప్రయాణికులు ఉండరు కాబట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందనే అభిప్రాయం ప్రయాణికుల్లో ఉన్న నేపథ్యంలో అట్టి బస్సు స్టాండ్ షట్టర్స్ ను మున్సిపాలిటీ అధికారులు అద్దె ప్రాతిపదికన కొనసాగిస్తేనే ఆదాయం సమకూరుతుంది అని పుర ప్రజలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాజీవ్ చౌక్ లో రోడ్డు పక్కననే బస్ షెల్టర్ ను ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు అనువుగా రోడ్డుకు పక్కనే ఉండటంతో ఎండాకాలమైనా, వానాకాలమైన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విధంగా బస్సు షెల్టర్ లను సంబంధిత అధికారులు చొరవతీసుకొని ఏరియా ఆసుపత్రి, రాజీవ్ చౌక్, అంగడి బజార్, యూనియన్ (ఆంధ్రా) బ్యాంక్, రామాలయం ఏరియాలలో బస్సులు ఆగే ప్రదేశాల్లో బస్ షెల్టర్ లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు. ప్రయాణికులంతా బస్ షెల్టర్ లు ఏర్పాటు చేయండి సారూ అని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *