-16వ డివిజన్లో ఆరేండ్ల బాలుడిపై “వీధి కుక్కల దాడి”
-కుక్కల నియంత్రణ పేరుతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా..
-పదవుల పైనే వ్యామోహం ..ప్రజా సమస్యలు గాలికి…
-పీర్జాదిగూడ పాలనపై తుంగతుర్తి రవి ఫైర్…
మేడిపల్లి(నేటీదాత్రీ):
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్లోని గణేష్ నగర్ కాలనీలో నివాసముండే పవన్ తేజ అనే ఆరేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి స్పందిస్తూ ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి…తమ పదవులు కాపాడుకోవడమే సరిపోతుందని.. లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏమైనట్టు…? ప్రతి డివిజన్లో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమైంది…? అని ఫిర్జాదిగూడ ప్రజలు నేడు ప్రశ్నిస్తున్నారని ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు నేడు పదవుల కోసం.. పైరవీలు.. విహారయాత్రలు.. చేస్తూ కాలం గడపడం సిగ్గుచేటని, వీధి కుక్కల బెడద పై గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు పాలకుల దృష్టికి, కమిషనర్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లిన ఫలితం మాత్రం శూన్యం.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా పాలకులు పట్టించుకోలేదని కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. లక్షలాది రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన పాలకులు దానిని సక్రమంగా నిర్వహించడం లేదని, ఈ సంఘటన అందుకు నిదర్శనం అన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నేడు పీర్జాదిగూడ పరిస్థితి ఉందని ఇకనైనా పాలకులు, అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యల నివారణ కృషి చేయాలని, యుద్ధ ప్రాతిపదికన వీధి కుక్కలను నియంత్రించే ప్రక్రియ వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.