`లెక్కల మీద లెక్కలు…సర్వేల తిప్పలు!
`సర్వే లెక్కలు..ఎక్కాల పుస్తకం అంకెలు?

`లక్షల మందిలో పదుల సంఖ్యల అభిప్రాయాలు
`జనం ముందుకొచ్చినవి ఎన్నో!

`ఊహల్లో రాసుకున్న ఆలోచనలెన్నో!
`స్వతంత్ర సర్వే సంస్థలు ఏవీ వుండవు
`ఏదో ఒక పార్టీ అండ లేకుండా అవి నడవవు
`ఎంచుకున్న పార్టీకి అనుకూలంగా సర్వే చెప్పకుండా వుండలేరు
`సాధారణ సమయాల్లో జనం మాటలు వేరు!
`ఎన్నికల వేళ ప్రజల ఆలోచనలు వేరు
`అధికారంలో వున్నంత కాలం సిఎం. లు సొంత సర్వేలు చేయిస్తుంటారు
`ఎమ్మెల్యేల పని తీరు మీద మార్కులిస్తుంటారు
`తీరా ఎన్నికల సమయంలో సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తారు
`జనం ముందుకు వచ్చి చేసిన వాళ్లు ఎవరూ లేరు
`అంతా ఆఫీసుల్లో కూర్చొని అల్లుకునే కథలు
`ఇప్పటికి వరకు ప్రజాభిప్రాయాన్ని వరుసగా స్పష్టంగా చెప్పిన సంస్థ ఒకటి లేదు
`సర్వేలే నిజమై వుంటే కొన్ని రాజకీయ పార్టీలు పోటీయే చేయవు
హైదరాబాద్, నేటిధాత్రి: సన్నాసికి సిగ్గుండదు..దరిద్రునికి బుద్ది వుండదు. కాని రాజకీయాల్లో ఎవరికీ సిగ్గుండదు. బుద్ది అసలే వుండదు. దూరాలోచన అసలే వుండదు. అందుకే పుట్టగొడుల్లా పుట్టుకొచ్చే సర్వేలను నమ్మి మోసం పోతుంటారు. సహజంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు ఐదేళ్లపాటు జనం మూడ్‌ను ప్రతి నిమిషం తెలుసుకుంటూ వుండడం జరుగుతుంది. ఐదేళ్ల కాలంలో జనం ఏమనుకుంటున్నారు? సరిగ్గా ఎన్నికల సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా అర్దం చేసుకోవచ్చు. కాని ఒక్క ఉప ఎన్నికలో కూడా పుట్టగొడుగుల్లా సర్వే సంస్దలు పుట్టుకురావడం విచిత్రం. విడ్డూరం. అంటే రాజకీయ పార్టీలకు, నాయకులు తమ నాయకత్వాల మీద నమ్మకం లేక సర్వేలు చేయించుకుంటారా? సర్వేలు ప్రత్యేకంగా చేయించుకంటే తప్ప జనం నాడీ తెలుసుకోలేరా? అధికారంలో వున్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోరు? అది ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏమీ వుండదు. అందరూ ఆ తాను ముక్కలే. ప్రతిపక్షంలో వున్నప్పుడు అదికారం కోసం అనేక అవస్ధలు పడుతుంటారు. జనం మద్యలో వుంటారు. జనానికి అందుబాటులో వుంటారు. జనం కోసమే రాజకీయం చేస్తున్నామని చెప్పుకుంటారు. ఒక్కసారి అదికారంలోకి వచ్చాక జనం ఏమనుకుంటు న్నారు? అనేది వినడానికి కూడా సమయం కేటాయించుకోరు. తాము చెప్పిందే నిజం. తమ మాటే శాసనం. తమ వాక్కేవేదం అనుకునేలా వ్యవహరిస్తుంటారు. ఇక్కడే రాజకీయ పార్టీలు, నాయకులు తప్పులో కాలేస్తుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎలా వుంటారో? అధికార పక్షంలో వున్నప్పుడు ఒకేలా వుంటే, అసలు సమస్యలే ఉత్పన్నం కావు. అయితే నాయకులు జేజేలకు మాత్రమే లొంగిపోతారు. పొంగిపోతారు. ఎప్పుడూ జేజేలు కొట్టించుకోవాలనే చూస్తారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు బాగా కొట్లాడుతున్నారు అనే మాటలే కోరుకుంటారు. ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద బాగా పోరటం చేస్తున్నాడనే పొగడ్తలే కోరుకుంటారు. అందుకు ఓ భజన బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని జేజేలు కోరుకుంటారు. అడుగు తీసి, అడుగేస్తే జిందాబాద్‌లు కొట్టాలని ఆశిస్తారు. అందుకు మరింత భజన బృందాన్ని నిలబెట్టుకుంటారు. అలా జేజేలు కొట్టించుకుంటే తప్ప వారికి నిమ్మలం వుండదు. పూట గడవదు. అలాంటి వారికి సర్వేలు తోడౌతుంటాయి. నిజాలు ఎప్పుడూ సర్వేలు చెప్పవు. దేశంలో ప్రజా పాలన మొదలైనప్పటి నుంచి సర్వేలు జరుగుతూనే వున్నాయి. అప్పటి నుంచి ఈసారి ఏ పార్టీ అదికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్ధలు ఏవీ లేవు. కాని సర్వేల మీద పార్టీలు, నాయకులు ఆధారపడి పోవడం అలవాటు చేసుకున్నారు. ఆ సర్వేలు కూడా పార్టీలకు, నాయకులకు అనుకూలంగా వచ్చేలా రిపోర్టులు తయారు చేయించుకోడం మొదలు పెట్టారు.ఇంత వరకు బాగానే వుంది. కాని ఉప ఎన్నికల కోసం సర్వేల హడావుడి ఏమిటో ఎవరికీ అర్దం కాకుండాపోతోంది. నిజం చెప్పాలంటే ఈ సర్వే సంస్ధలన్నీ ఒక రకంగా బోగస్. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఎంపి. లగడపాటి రాజగోపాల్‌ను ఆంద్రా ఆక్టోపస్ అని పిలిచేవారు. ఆయన సర్వేలను ఎప్పటికప్పుడు చేయిస్తూ వుండేవారు. అయితే రాష్ట్రాల, కేంద్రం సార్వత్రిక ఎన్నికల సర్వేలు చేయిస్తూ వుండేవారు. కొంత వరకు అటూ, ఇటూ కాస్త తేడాతో సర్వే వివరాలు వెల్లడిస్తూవుండేవారు. మొదట్లో కాస్త లెక్కలను బాగానే అంచనా వేసినట్లు కనిపించేవారు. జాతీయ స్ధాయిలో మీడియా సంస్థలు కూడా ఒక దశలో లగడపాటి రాజగోపాల్ సర్వేకోసం ఎదురుచూసేలా కూడా చేశాయి. కాని ఆయన వేసిన అంచాలన్నీ , చేసిన లెక్కలన్నీ, ఎక్కాల పుస్తకంలో అంకెలే అని తేలిపోయింది. తనను తాను అధికంగా ఊహించుకోవడం మొదలు పెట్టారు. బోల్తా పడ్డారు. ఇక సర్వేలు చేయడం ఆపేశారు. అందులో కూడా సవాలు చేసి మరీ ఓడిపోయారు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. నిజానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని ముందు నుంచే కొన్ని సంకేతాలు అప్పటికే కేసిఆర్ ఇస్తూ వుండేవారు. ఆఖరుకు అదే చేశారు. ఆ సమయంలో లగడపాటి రాజగోపాల్ సర్వే చేయిస్తున్నట్టు గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరుకు గజ్వెల్లో కూడా కేసిఆర్ ఓడపోతున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోతుంది? అని తన జోస్యం చెప్పేశారు. అయితే తన జోస్యం నిజం కాకపోతే ఇకపై సర్వేలు చేయడం ఆపేస్తానని శపథం చేశాడు. కాని బిఆర్ఎస్ రెండోసారి బంపర్ మెజార్టీతో 88 సీట్లు గెల్చుకున్నది. లగడపాటి సర్వే తుస్సుమన్నది. నిజంగానే సర్వే సంస్దలు నిర్వహించే వాటికి సైంటిఫిక్ అనాలిసిస్ వుంటుందని అనుకోవడం భ్రమ. సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగే ఏ సర్వేకు ప్రాతిపదిక వుండదు. అంతే కాకుండా అభ్యర్ధుల ఎంపిక తర్వాత వచ్చే సర్వే వివరాలు అసలే నిజంకాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం ఎంతో కొంత నిజం బహరింగానే చెబుతారు. దాంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అంచనా వేయడానికి ఎంతో కొంత వీలౌతుంది.కాని ఉప ఎన్నికల సమయంలో సర్వేలు అనేవి కత్తి మీద సాము. అందుకే చేయరు. కాని ఏవేవో ప్రకటిస్తుంటారు. కొత్త కొత్త సంస్ధలు పుట్టగొడుల్లా వస్తుంటాయి. తమ తమ సర్వే వివరాలు అంటూ వెల్లడిస్తుం టాయి. కాని ఆ సర్వేలన్నీ ఏదొ ఒక పార్టీకి అనుకూలంగానే సాగిస్తుంటారు. నిజంగానే ఒక సర్వే సంస్ధ కష్టపడి సర్వేలు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.సర్వే నిర్వాహకులుగాని, సర్వే సంస్దలుగాని, అందులో పనిచేసే వాళ్లు కూడా ఊడిగం చేయరు. ఊరికే పనిచేయరు. అందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది.అది కూడా లక్షలు, కోట్లలో అవుతుంది. ఆ ఖర్చును ఊరికే ఎవరూ భరించుకోరు. సహజంగా రాజకీయ పార్టీలకు సూచనలు, సలహాలతోనే ఏటా కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు చెబుతుంటారు. అలా తొలుత ఒకటో రెండు చోట్ల వారి అంచనాలు నిజమైతే చాలు. ఇక రాజకీయపార్టీలు ఆ సంస్ధల వెంట పరుగెడుతుంటారు. అదే ప్రశాంత్ కిషోర్ తన రాజకీయపార్టీని మాత్రం గెలిపించుకోల ేకపోతున్నాడు. రాష్ట్రాలల రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించే ప్రశాంత్ కిషోర్‌కు తన పార్టీకి మాత్రం వ్యూహ రచన చేసుకోలేకపోతున్నాడు. అంటే రాజకీయాల్లో సర్వేల విన్యాసం, ఊహల బారతం అంతా ఉట్టిదే. అదంతా సంపాదనలకోసమే… అయినా రాజకీయ పార్టీలు నమ్ముతూనే వుంటాయి. తమ బలహీనతను బైట పెట్టుకుంటూనే వుంటాయి. నిజంగానే సర్వేలు చెప్పిన మాటలే నిజమైతే ఓడిపోతారనుకునే నాయకులు, ఆ పార్టీలు ఎన్నికల బరిలోకే దిగరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయానికే వద్దాం..రాజకీయ పార్టీలు వెళ్లి ఓట్లు అడిగితేనే సరే సరే అంటారు. ప్రచారానికి వచ్చిన అన్ని పార్టీలకు అదే సమాదానం చెబుతారు. మా ఓటు మీకే అంటారు. కాని మీకు ఓటు వేయమని ఎవరూ ముఖం మీద చెప్పరు. అలా చెప్పేవారు సహజంగా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లైనా వుంటారు. లేకుంటే ఏదైనా రాజకీయ పార్టీకి అభిమానులైనా అయి వుంటారు. అంతే కాని తటస్ధులు ఎవరూ ప్రచారానికి వచ్చిన వారి ముఖం మీద ఓటు వేయమని చెప్పరు. అలాగే ఉప ఎన్నికల సమయంలో జరిపే సర్వేల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పరు. సర్వేలకు వెళ్లేవారు ఊహించుకోవడం, అంచనా వేసుకోవడం మాత్రమే వుంటుంది. అయితే ఏదైనా పార్టీకి సర్వే చేస్తున్నారో ఆ సంస్ధలు మాత్రం ఆ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనలు వుంటే వాటిని బైట పెట్టరు. మీ పార్టీ ఓడిపోతుందని ఎట్టిపరిస్ధితుల్లోనూ చెప్పరు. ప్రజలు తమ పార్టీ వైపే వున్నారంటూ లెక్కలు చెబుతారు. సర్వేలు చేసినందుకు అయిన ఖర్చులు వసూలు చేసుకుంటారు. ఏ సర్వే సంస్ధ అయినా సర్వే చేసి ఓడిపోతుందని చెబితే ఒక్క రూపాయి కూడా ఏ పార్టీ ఇవ్వదు. ఈ మాత్రం జనానికి తెలియదా? పార్టీలకు అంచనా వేసుకోలేవా? అయినా సర్వేల వెంట వేలం వెర్రిలా పడుతుంటారు. సర్వేలు చేయించుకుంటారు. ఈ మధ్య మరో దరిద్రం మొదలైంది.సర్వేల మూలంగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల గెలుపోటములేమో గాని, సర్వే సంస్దల వల్ల బెట్టింగుల జోరు మాత్రం పెరుగుతోంది. అదో వ్యాపారమైపోయంది.
