కొనుగోలు కేంద్రాలే రైతులకు కష్టాల కేంద్రాలా..?
“ఆన్లైన్ సైట్” సాకుతో ఆలస్యం… దళారుల దోపిడీకి రైతుల బలి
అయినవోలు మండలంలో మొక్కజొన్న – వరి కొనుగోళ్లలో రాజకీయాలు
నెలల తరబడి ఇబ్బందులు పడుతున్న రైతుల గోడు పట్టదా??స్పందించని ఎమ్మెల్యే – నైరాశ్యంలో రైతులు
నేటి ధాత్రి అయినవోలు :-
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కాలనే ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తుంటే, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత, తూకాల ఆలస్యం, “ఆన్లైన్ సైట్ పనిచేయడం లేదు” అనే సాకులు… మరోవైపు వరి కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులుగా కాంటాలు కాక రైతులు పడుతున్న అవస్థలు ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యమని ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యం మాత్రం రైతుల నష్టాలకు కారణమవుతోంది. కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగి, తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మొక్కజొన్న రైతుల దుస్థితి
అయినవోలు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన రైతులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. గోనె సంచులు లేవని, సర్వర్ పనిచేయడం లేదని, ఆన్లైన్ నమోదు కాలేదని చెబుతూ అధికారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూకాలు వేయడంలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతుండటంతో రైతులు ఎండలో, రాత్రిళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చివరకు విసిగిపోయిన రైతులు ప్రభుత్వ ధర కోసం ఎదురు చూడలేక, దళారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగి రైతు అప్పుల్లో కూరుకుపోతుంటే… మరోవైపు పండించిన పంటకు సరైన ధర దక్కకపోవడం రైతును మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
నందనం గ్రామంలో వరి రైతుల ఆందోళన
అదే మండలంలోని నందనం గ్రామంలో వరి కొనుగోలు కేంద్ర పరిస్థితి కూడా భిన్నంగా లేదని రైతులు చెబుతున్నారు. నెలరోజులుగా వడ్లు కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు పడే సూచనలు ఉండటంతో ధాన్యం తడిసిపోతుందేమోనని భయపడుతున్నారు.
సీఈవో నిర్లక్ష్యం వల్లే కాంటాలు జరగడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. “పంట పండించడం వరకే రైతు బాధ్యతా..? కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా..?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడం
అధికారులు సమయానికి స్పందించకపోవడం వల్ల రైతుల సహనం క్రమంగా కోల్పోతున్నారు.
“ఆన్లైన్ సమస్య” నిజమా..? సాకా..?
ప్రతి సమస్యకూ “సైట్ పనిచేయడం లేదు” అనే ఒకే సమాధానం చెప్పడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సాంకేతిక సమస్యలు నిజంగానే ఉన్నాయా..? లేక కొనుగోళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి దళారులకు అవకాశం కల్పిస్తున్నారా..? అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఒక ఉద్యోగి ప్రశాంతంగా గోనె సంచులు పక్కదారి పట్టిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి
రైతు పండించిన ధాన్యం కొనుగోలు కాక కొనుగోలు కేంద్రాల వద్దే పాడైపోతే, రైతు సంక్షేమం గురించి చెప్పే మాటలు ఎంతవరకు నిజమన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గోనె సంచుల కొరత నివారించాలి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.తూకాలు పారదర్శకంగా నిర్వహించాలి
ఆన్లైన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. దళారుల దోపిడీని అరికట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
అప్పుడే రైతులకు న్యాయం జరిగినట్లవుతుంది. లేదంటే కొనుగోలు కేంద్రాలు రైతులకు సహాయక కేంద్రాలుగా కాకుండా, కష్టాల కేంద్రాలుగానే మిగిలిపోతాయి.
