సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్, గణపురం,చెల్పూర్ గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని…డిమాండు చేస్తూ ధర్మసమాజ్ పార్టీ నాయకులు స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ కు వినతి పత్రం అందచేశారు. వారు మాట్లాడుతూ .. వాస్తవానికి ఇటుక బట్టి నిర్వహణకు భూగర్భగనులు, రెవిన్యూ, నీటిపారుదల, పంచాయితీరాజ్, , అటవీ కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ , నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి ఇటుక బట్టీలు నిర్వహించాలంటే ముందుగా మైనింగ్ నుండి బ్రిక్లిన్ సర్టిఫికెట్, తీసుకొని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా తాసిల్దార్ నుంచి అనుమతి తీసుకుని నాలా వచ్చిన తర్వాత బట్టిలు కొనసాగాలి. అయితే ఇటుక బట్టీల నిర్వాహకులు ఇవేమీ పట్టించు కోకుండా ధనార్జనే ధ్యేయంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి సగటున ఏటా రూపాయలు 2 కోట్ల ఆదాయం నష్టం జరుగుతుందని, ప్రజలు నివసించే ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధన ఉన్న, వాటిని వ్యాపారులు తుంగలో తొక్కి, పర్యావరణాన్ని పచ్చని పల్లెలను నాశనం చేస్తున్నారు.నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టిలను ఏర్పాటు చేస్తూ అడిగేవారు లేక ఆడిందే ఆటగా పాడిందే పాటగా అడ్డు అదు పులేకుండా, ఇష్ట రాజ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసి వస్తుంది. వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు నిర్వహిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు. వ్యాపారులు వ్యాట్ చెల్లించడం కానీ, అనుమతులు పొందడం లాంటివి చేయకపోవడం వలన ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్కువ ఆదాయం కోల్పోతుంది సంవత్సరానికి కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది.
ఇంత జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ కుర్రీ స్వామి నాధన్,జిల్లా ప్రధాన కార్య దర్శి కండె రవి, జిల్లా ఉపాదక్షులు కోగీల జితేందర్ , ఇంజపెల్లి విక్రమ్ , తదితరులు డిమాండ్ చేస్తున్నారు .