వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.
◆- అన్ని వర్ణాల వారు అర్హులే
జహీరాబాద్ నేటి ధాత్రి:
సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వేదంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ వర్ణానికి చెందినవారైనా అర్హులేనని తెలిపారుప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదంలోని వివిధ కోర్సులు చదువుతున్నారని వారు పేర్కొన్నారు. ఆశ్ర.మంలో వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఉంటుందని వారు అన్నారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేదాంత, న్యాయ, యోగదర్శనం,ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర తరగతులు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆచార్యులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నెల 29న మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 5న అడ్మిషన్లు జరుగుతాయని, జూన్ 12న లింగదీక్షతోతరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గలవారు దత్తగిరి ఆశ్రమ కార్యాలయాన్ని లేదా మరింత సమాచారం కోసం చరవాణి 9177259329, 86392 58008 ద్వారా సంప్రదించాలని కోరారు.