
Mandamarri Ganesh Mandap Guidelines for Safe Navaratri
గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి
ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి.
– శశిధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్, మందమర్రి.
భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం
తెలంగాణ రాష్ట్ర పోలీసుల వెబ్సైట్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా సేకరించిన సమాచారం కేవలం మండపం నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కొరకు మాత్రమే. ఈ సమాచారం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసు శాఖకు సులువుగా ఉంటుంది. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేస్తుంది, అనుమతి పొందిన తర్వాతే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాము.
ఆన్లైన్లో దరఖాస్తు చేయు విధానం:
అధికారిక లింక్: https://policeportal.tspolice.gov.in/
పైన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, అందులో ఈ క్రింది వివరాలను పూర్తిగా నమోదు చేయాలి:
* దరఖాస్తుదారుని వివరాలు
* విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం పోలీస్ స్టేషన్ పరిధి
* విగ్రహం మండపం ఎత్తు
* కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు చిరునామా
* విగ్రహ ప్రతిష్ట తేదీ నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం
* నిమజ్జనానికి ఉపయోగించే వాహనం వివరాలు
* మండప నిర్వాహకులు వాలంటీర్ల పూర్తి వివరాలు
గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన నియమ నిబంధనలు: గణేష్ మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదే. మండపాలకు వినియోగించే విద్యుత్ నీ సంబంధిత శాఖ వారి అనుమతితో తీసుకోవాలి. అలాగైతే ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి వీలవుతుంది.
వినాయక విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు అదే విధంగా, నిమజ్జనానికి తీసుకువెళ్తున్నప్పుడు విద్యుత్ తీగలను గమనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే నిమజ్జనం పూర్తి చేయాలి.
గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత యజమాని లేదా ప్రభుత్వ శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యుల వివరాలు, మరియు వారి ఫోన్ నెంబర్లను మండపం వద్ద కనిపించేలా ఏర్పాటు చేయాలి.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లను వినియోగించరాదు.
మండపాల్లో శోభాయాత్ర సందర్భంగా డీజే (బి జె)లను ఏర్పాటు చేయడంపై పూర్తి నిషేధం విధించబడింది. గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు వాలంటీర్లు పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటిని నియంత్రించడానికి వాలంటీర్లను నియమించాలి. అగ్ని ప్రమాదాల నివారణకు ముందుజాగ్రత్త చర్యగా మండపం దగ్గర రెండు బకెట్ల నీళ్లు, రెండు ఇసుక బస్తాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ (ఆంటీ-ఫైర్ ఎక్విమెంట్) ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం లేదా పాటలు పెట్టడం పూర్తిగా నిషేధం.
ప్రతీ మండపం వద్ద విధిగా ఒక “పాయింట్ పుస్తకం” ఏర్పాటు చేయాలి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో సూచనలు వ్రాసి సంతకం చేస్తారు. మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే, తక్షణమే డయల్ 100కు గానీ లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలి.
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి పుకార్లను, వదంతులను నమ్మవద్దు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలి. పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు వారికి సహకరిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నవరాత్రులు శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నాము.