
Vinayaka Navratri celebrations
వినాయక నవరాత్రి ఉత్సవాలపై విజ్ఞప్తి.
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ ని కలిసిన “రాష్ట్రీయ హిందూ పరిషత్” వరంగల్ జిల్లా కమిటీ.
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ ని, రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మడిపెళ్లి నాగరాజు గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గణపతి నవరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్ పట్టణంలో అనేక భక్తులు వినాయక ఉత్సవ కమిటీలు స్థాపించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మండపాల వద్ద భద్రతా చర్యలు, పర్మిషన్ల జారీ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతినిధులు డీసీపీని కోరారు.
అలాగే మండపాల నిర్వహణపై అవగాహన కలిగిస్తూ వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శివరామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు గోగీకర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.