Horse Dance Steals the Show at Urs Festival
బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..
బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.
ఢాకా, ఫిబ్రవరి 12: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందూ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. శవాన్ని టీ తోటలో పడేసి పోయారు. బుధవారం ఈ హత్య వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రతన్ శివోకర్ అనే వ్యక్తి ఇస్లామ్పూర్ యూనియన్‌లోని చంపారా టీ గార్డెన్లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు.
మంగళవారం అతడు కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు రాత్రి వరకు అతడి కోసం వెతికారు. టీ తోటలో పడి ఉన్న రతన్ మృతదేహాన్ని బుధవారం ఉదయం తోటి కూలీలు గుర్తించారు. రతన్ కుటుంబంతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. రతన్ శవం రక్తపు మడుగులో పడి ఉంది. అతడి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రతన్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్నది తెలియరాలేదు. ఎన్నికల కారణంగా రతన్ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. అతడిని ఎక్కడో చంపి, శవాన్ని తోటలో తెచ్చి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కారణంగానే రతన్ హత్య జరిగి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
