
"High Court Hearing on Cable Wire Case"
కేబుల్ వైర్ల వ్యవహారంపై మరోసారి హైకోర్టులో విచారణ..
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన రామాంతపూర్ శోభాయాత్రలో జరిగిన విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో..హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్‌ను పరిశీలిస్తూ, ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించటం శోచనీయమని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికింది. కేబుల్ వైర్ల పునరుద్ధరణకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అనంతరం ప్రభుత్వ అధికారులు కేబుల్ వైర్లను కట్ చేయడంతో టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ మరోసారి హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరపనుంది.
రామంతపూర్‌లో ఇటీవల చోటు చేసుకున్న విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో హైకోర్టు వైర్లు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. కేబుల్‌లలో విద్యుత్ ప్రసారం జరగదని.. ప్రమాదానికి కేబుల్ వైర్లు కారణం కానే కాదని స్పష్టంచేశారు. వీటి తొలగింపుతో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో వైపు,ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రాణనష్టం ఘటనను సీరియస్‌గా తీసుకున్న కమిషన్, బాధిత కుటుంబాలకు పరిహారంపై, ప్రమాదానికి దారితీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, విద్యుత్ శాఖను కూడా భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్ఎస్పీడీసీఎల్కు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేబుల్ తొలగింపు విషయంలో హైకోర్టు కూడా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజల ప్రాణాలు పోతుంటే కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యతను విస్మరించి ప్రజల భద్రత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని పూర్తిగా తప్పుపట్టింది.
అయితే, అధికార అనుమతులతోనే కేబుళ్లు అమర్చామని.. ప్రతి స్తంభానికి ప్రభుత్వానికి రూ.1100 చొప్పున మొత్తం రూ.21కోట్లు చెల్లించామని భారతి ఎయిర్టెల్ వాదిస్తోంది. చెల్లింపుల వివరాలను గత విచారణలోనే హైకోర్టులో నివేదించింది. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం అప్పటికప్పుడు కేబుల్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వం నిబంధనను పట్టించుకోని కారణంగా తమ కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారని విన్నవించింది. డాక్టర్లు, న్యాయవాదులు, మీడియా, వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు– ఇంటర్నెట్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. టీఎస్ఎస్పీడీసీఎల్ తరఫున న్యాయవాది వాదిస్తూ, ఒకే స్తంభానికి అనధికారికంగా అనేక కేబుళ్లు అమర్చారని, ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని పేర్కొన్నారు. దీంతో, జస్టిస్ నాగేశ్ భీమపాక పునరుద్ధరణపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. అన్ని పక్షాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించిన అనంతరం మాత్రమే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.