నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.
– పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
– లుసిడా చేతివ్రాతలో ప్రభంజనం
– ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో జాతీయ మొదటి బహుమతి
– విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కృషి
– ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
– పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు
–
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంత పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధనలు ప్రారంభించగా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆడియో వీడియో విజువలైజేషన్లో తరగతుల నిర్వహణతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి శిక్ష అవార్డు పొందామని తెలిపారు. అలాగే విద్యార్థి భవిష్యత్తుకు చక్కటి చేతి వ్రాత ఎంతో అవసరమని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో లుసిడ చేతి వ్రాత తరగతులు నిర్వహించామని, చేతివ్రత పోటీలలో నవత విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని అన్నారు. నవత విద్యార్థుల ప్రతిభతో అక్షర చేతివ్రాత ఫౌండేషన్ అధ్యక్షులు మీరజ్ అహ్మద్ ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రస్థాయి సూపర్ 10 లో మూడు బహుమతులు, స్టేట్ 50లో 12 బహుమతులతో పాటు వివిధ కేటగిరీలో మొత్తం 90 అవార్డులు సాధించి రాష్ట్రంలోనే మరే ఇతర పాఠశాల సాధించని ఘనత సాధించామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
