మరపురాని చిత్రాలు అందించిన ‘అన్నపూర్ణ పిక్చర్స్’
తెలుగువారికి అపురూప చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ చిత్రాలలో కథకథనాలకే కాదు సంగీతసాహిత్యాలకూ ఎంతో ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మించారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుDukkipati madhusudhana rao Memorable movies
తెలుగువారికి అపురూప చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ చిత్రాలలో కథకథనాలకే కాదు సంగీతసాహిత్యాలకూ ఎంతో ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మించారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు(Dukkipati madhusudhana rao). మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును నాటకాల నుంచీ తీర్చిదిద్దినదీ ఈ మధుసూదన రావే. సినిమా రంగంలో అక్కినేనిని (ANR) +-అగ్రపథాన నిలపాలనే ధ్యేయంతోనే ‘అన్నపూర్ణ పిక్చర్స్’ ను నెలకొల్పారు. ఆ సంస్థకు ఏయన్నార్ ను ఛైర్మన్ గా నియమంచి తాను మేనేజింగ్ డైరెక్టర్ గా అన్ని వ్యవహారాలూ చూసుకున్నారు దుక్కిపాటి. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో ‘దొంగరాముడు’ (1955) నిర్మించి అలరించారు. తరువాత బెంగాలీ నవల ఆధారంగా ‘తోడికోడళ్ళు’ (1957) నిర్మించారు. ఈ చిత్రంతోనే ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా నిలదొక్కు కున్నారు. ఆ పై ఏయన్నార్ హీరోగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన ‘మాంగల్య బలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, విచిత్ర బంధం, బంగారుకలలు’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఈ చిత్రాలలో అనేకం ఏయన్నార్ కెరీర్ లో మైలురాళ్ళుగా నిలిచాయి. ఏయన్నార్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఇద్దరు మిత్రులు’ (1961) మంచి విజయం సాధించింది. నవలా చిత్రంగా వెలుగు చూసిన ‘డాక్టర్ చక్రవర్తి’ (1964) నంది అవార్డు అందుకున్న తొలి సినిమాగా నిలచింది.
తరువాతి రోజుల్లోనూ దుక్కిపాటి తనదైన బాణీ పలికిస్తూనే చిత్రాలను నిర్మించారు. యద్దనపూడి నవలలు ‘ప్రేమలేఖలు, రాధాకృష్ణ’ను అవే టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. బాపు దర్శకత్వంలో ‘పెళ్ళీడు పిల్లలు’ (1982), సింగీతం శ్రీనివాసరావు నిర్దేశకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ (1987) నిర్మించారు దుక్కిపాటి. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా సినిమాలకు దూరంగా జరిగారు దుక్కిపాటి. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో తమ ‘అన్నపూర్ణ పిక్చర్స్’కు ఓ ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టి, తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశారు దుక్కిపాటి మధుసూదనరావు. 1917 జూలై 27న జన్మించిన దుక్కిపాటి తన చిత్రాల ద్వారా పలు అవార్డులూ, రివార్డులు సంపాదించారు. 2006 మార్చి 26న తుదిశ్వాస విడిచారు.