పార్టీపై మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారా?
విభేదాలతో ఓటర్ ఐ.డి. సమస్య తెరమరుగు
అందరూ ఫైర్ బ్రాండ్‌లే…ఎవరూ తగ్గేదే లేదు
క్రమశిక్షణా సంఘం సమావేశం వాయిదా పార్టీలో అనిశ్చితికి సంకేతం
బీజేపీలో నెలకొన్న జోష్
వక్ఫ్‌బిల్లు ఆమోదంతో కొన్ని ముస్లిం వర్గాల్లో తృణమూల్ పట్ల ఆగ్రహం
తృణమూల్‌లో బట్టబయలైన విభేదాలు
హైదరాబాద్,నేటిధాత్రి
ఒక చిన్న అగ్గిపుల్ల చాలు పెద్ద దావానలం సృష్టించడానికి…అన్న సామెత తృణమూల్ కాంగ్రెస్ విషయంలో ఇప్పుడు నిజం కావడం వర్తమాన ఆశ్చర్యకర పరిణామం. బెంగాల్ టైగర్‌నంటూ చెప్పుకొని, ప్రత్యర్థులను నోరెత్తనీయకుండా ఏక ఛత్రాధిపత్యంగా బెంగాల్‌ను ఏలుతున్న మమతాబెనర్జీ ఇప్పుడు బయల్పడిన తన పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా నోరెళ్లబెట్టే పరిస్థితి దా పురించడం వర్తమాన చరిత్ర! 34సంవత్సరాలు ఏకబిగిన ఉడుంపట్టుతో బెంగాల్‌ను ఏలిన వా మపక్ష కంచుకోటను కుప్పకూల్చి అధికారాన్ని చేపట్టిన మమతమ్మకు ఇప్పుడు తానొక అగ్నిపర్వ తంపై కూర్చునానన్న సంగతి స్పష్టమైవుంటుంది. ఇంతకూ జరిగిందేమంటే ఏప్రిల్ 4న, రాష్ట్రం లో డూప్లికేట్ ఓటర్ ఐ.డి. నెంబర్ల విషయంలో ఢల్లీిలోని ఎన్నికల కమిషన్‌కు ఒక పత్రాన్ని ఇ వ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే వెళ్లేముందు పార్టీ ఎంపీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని మరీ ఎన్నికల సంఘాన్ని కలవాలని కోరింది. అయితే పార్టీ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీతో పాటు ఎన్నికల సంఘాన్ని కలిసే పార్టీ ఎంపీల జాబితాలో కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా పేరు లేదు. ఆయనే నేరుగా ఎన్నికల సంఘాన్ని కలవడానికి యత్నించారు. దీంతో ఎన్నికల సంఘం ఆఫీసుకు వచ్చిన ఈమె తన పేరు జాబితాలో లేకపోవడంతో కళ్యాణ్ బెనర్జీని ప్రశ్నించినప్పుడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో మొయిత్రా ఆగ్రహంతో అక్కడి సి.ఐ.ఎస్.ఎఫ్ జవాన్లను ఏకంగా బెనర్జీని అరెస్ట్ చేయమని కోరడం వరకు వెళ్లింది. అంతేకాదు ఆమె విలపిస్తూ, ఎంపీల వాట్సాప్ గ్రూపు నుంచి కూడా తప్పుకోవడం అనంతర పరిణామం.
‘‘నాకు నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వుంది. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలకు వ్యతిరే కంగా పోరాడిన రాజకీయానుభవం వుంది. ఈ మహిళా ఎంపీకి కేవలం ఆదానీ, నరేంద్రమోదీ తప్ప మరో సమస్యే కనిపించదు. పార్లమెంట్‌లో తనకు ఇష్టంవచ్చినంతసేపు మాట్లాడాలి. నా కుమార్తెపై కూడా ఈమె కొన్ని కామెంట్లు చేసింది. నేను వక్ఫ్‌బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడిన దగ్గరినుంచి ఆమెకు నాపై కోపం’’ అంటూ కళ్యాణ్ బెనర్జీ రెచ్చిపోయారు. ఇక విలేకర్ల సమావే శంలో మాట్లాడుతూ మరో ఎంపీ సౌగత్‌రాయ్‌పై కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ‘‘నారదా స్కామ్‌లో సౌగత్‌రాయ్ లంచాలు తీసుకోవడం వల్లనే కదా పార్టీ పరువు గంగలో కలిసింది.ఒకళ్లపై మరొకరిని రెచ్చగొట్టడం, గోతులు తీయడమే ఆయన పని. ఒకవేళ దీదీ కోరితే రాజీనామా చేస్తాను’’ అని కళ్యాణ్ బెనర్జీ అన్నారు.
దీనిపై సౌగత్‌రాయ్ స్పందస్తూ, ‘‘మొహువా మెయిత్రా ఏడుస్తూ వెళ్లిపోయింది. బెనర్జీని పార్లమెంట్‌లో ఛీఫ్ విప్ పదవినుంచి తొలగించాలి’’ అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు కళ్యాణ్ బెనర్జీ ఒక ‘అనాగరిక వ్యక్తి’ వక్ఫ్‌బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా గ్లాసును పగులగొట్టి ఛైర్మన్ ప్యానల్‌పై విసిరేయడం ఎంతవరకు సమంజసమంటూ’ ఆయన ప్రశ్నిం చారు.
ఈ బాగోతానికి చెందిన వీడియో షార్ట్స్‌ను బీజేపీ ప్రతినిధి, ఐ.టి.సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఆ వీడియోలో క ళ్యాణ్‌జీ గట్టిగా అరుస్తున్నట్టు రికార్డయింది. దీని తర్వాత ఏప్రిల్ 8న సీరామ్‌పూర్ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీ, బర్ద్వాన్`దుర్గాపూర్ ఎం.పి. కీర్తి అజాద్‌మధ్య మాటలయుద్ధం జరిగింది. ఈ సంద ర్భంగా కళ్యాణ్‌జీ ‘‘ఇటువంటి రాజకీయాలు నెరపినందుకే బీజేపీనుంచి గెంటేశారని’’ ఆగ్రహం తో ఊగిపోయారు. ఇక ఆజాద్ ‘‘పదేపదే నేరాలకు పాల్పడే చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తించవద్దంటూ’’ ఎదురుదాడికి దిగడంతో మరింత రచ్చ అయింది. ఇక్కడ ఆజాద్ మొహువా మెయిత్రాకు మద్దతుగా నిలవడం గమనార్హం. కళ్యాణ్ బెనర్జీ ఈ సందర్భంగా ‘‘ఆ మహిళా ఎంపీ దురు సు స్వభావం కలది మాత్రమేకాదు, నాగరికత లేనిదంటూ’’ విమర్శించారు. కేవలం తన పేరులేదన్న కారణంగా నాపై విరుచుకుపడిరదంటూ ఆయన ఆరోపించారు. అంతకుముందు బెనర్జీ ‘‘కీర్తీ ఆజాద్, సీ.ఆర్.పార్క్‌లోని పార్లమెంట్ క్యాంటీన్‌లో ‘షోందేష్’ పేరుతో ఒక స్వీట్ షాపు తెరవడానికి స్పీకర్ అనుమతికోసం ఎంపిల సంతకాలు సేకరిస్తున్నారు. నాకీ విషయం తెలిసి దీన్ని వ్యతిరేకించాను. ఫలితంగా ఈ లేఖను స్పీకర్‌కు సమర్పించలేకపోయారు. దీనివెనుక ఏ డీల్స్ వున్నాయో? దీంతో కక్షను పెంచుకొని నాపై విమర్శల దాడికి దిగుతున్నారంటూ’’ ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన వీడియోలు, ఎంపీల మధ్య విభేదాలను వెల్లడిరచినప్పటికీ, ఈ స్పర్థలు కేవలం ఇప్పటివి కావని ఎప్పటినుంచో పార్టీలో నివరుగప్పిన నిప్పులా వున్నాయన్నది తెలుస్తోంది. గతంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మొహువా మెయిత్రా, శత్రుఘ్నసిన్హా, కీర్తీ ఆజాద్‌లు కొన్ని కామెంట్స్ చేశారు.
2022లో పార్టీ ఎంపీ శతృఘ్నసిన్నా పార్టీ నాయకత్వ పనితీరుపై తన అసంతృప్తిని నేరుగా వ్య క్తం చేశారు. 2019లో భాజపాను వీడి టీఎంసీలో చేరినప్పటినుంచి తన సేవలను పార్టీ నాయ కత్వం గుర్తించడంలేదన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల ఆయన ఇ ప్పటికీ తీవ్ర అసంతృప్తితో వున్నారు. అదేవిధంగా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత లేదంటూ, టీఎంసీ పనితీరును కీర్తీ ఆజాద్ తప్పు పట్టారు. ఇక మొహువా మెయిత్రా కూడా పార్టీ అధిష్టానంపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వుంటారు. ఆమె మమతాబెనర్జీకి విధేయంగా వున్నప్పటికీ, పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. 2021లో ఆమె జాతీయ రాజకీయాలపై పశ్చిమబెంగాల్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. మమ తా బెనర్జీ కోటరీ అనుసరిస్తున్న కేంద్రీకృత వ్యవహారశైలిని ఆమె విమర్శించారు కూడా. స్థానికంగా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహారశైలిని ఆమె కొన్ని సందర్భాల్లో విభేదించారు. అయితేపార్టీలో ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే తానీ విమర్శలు చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. ఇక2023లో సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. బెనర్జీ వ్యవహారశైలివల్ల పార్టీ ఇమేజీ దెబ్బతింటున్నదని సౌగత్ రాయ్ విమర్శించడంతో, పార్టీలో ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు పొక్కాయి.
ఒకపక్క కళ్యాణ్ బెనర్జీ, సౌగత్ రాయ్, మొహువా మెయిత్రా, కీర్తీ ఆజాద్‌ల కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌లో వాతావరణం హాట్‌హాట్‌గా మారిన తరుణంలోనే, తృణమూల్ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సమావేశం ఆకస్మికంగా వాయిదాపడటం పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి 30మంది పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఈ క్రమశిక్షణా సంఘం ఏప్రిల్ 8న సమావేశం కావాల్సివుంది. కానీ ఇప్పుడీ సమావేశం నిరవధికంగా వాయిదాపడిరది. ఈ క్రమశిక్షణాసంఘానికి పార్లమెంట రీ వ్యవహారాల మంత్రి సోబందేవ్ చటోపాధ్యాయ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం వా యిదాపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కమిటీ సభ్యుడు నిర్మల్ ఘోష్‌ఈ సమావేశం ప్రస్తుతానికి వాయిదాపడిరదని, ఎప్పుడు జరిగేదీ మళ్లీ తెలియజేస్తామని విలేకర్ల కు చెప్పారు. ఇదిలావుండగా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ, ‘‘సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న విభేదాల కారణంగానే ఈ సమావేశం వాయిదా పడిరదని’ చెప్పడం గమనార్హం. నిజానికి గత మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా శాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ సహా 30మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజర య్యారు. ఈ క్రమశిక్షణా సంఘం సమావేశంలో వారిని సంజాయిషీ కోరాల్సి వుంది. బడ్జెట్ సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు పార్టీ జారీచేసిన విప్‌ను వీరు ధిక్కరించినట్లయింది.
తృణమూల్ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు బీజేపీలో జోష్ పెంచడం సహజమే. పార్టీ ప్రతినిధి, ఐ.టి.సెల్ ఛీఫ్ మాలవ్యా ఏప్రిల్ 8న మరో షార్ట్ వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. అందులో కళ్యాణ్ బెనర్జీ ‘‘అసలు మమతా బెనర్జీదే తప్పు. కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలనుంచి తక్షణమే తప్పుకుంటా’’ అని వుంది. ఈయనకు వెనుక దన్నుగా ఎవరున్నారంటూ మాలవ్యా ప్రశ్నించడం కీలకం! తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు బయటకు రావడంతో, పార్టీలో క్రమశిక్షణ డొల్ల అనేది స్పష్టమైంది. ఇప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన దగ్గరి నుంచి పార్టీ ప్రతిష్ట గణనీయంగా దిగజారింది. గతంలో నారదా స్కామ్‌లు, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు మమతను కదల్చలేకపోయినా, ఆర్జీకర్ సంఘటన పార్టీని కుదిపేసింది. దీనికి తోడు వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం, మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో, ఏ ముస్లిం ఓట్లను నమ్ముకొని అధికారంలో వున్నదో, ఆ వర్గాల్లోనే చాలామంది పార్టీనాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా వుందో, తృణమూల్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. హిందువుల్లో ఇప్పటికే నెలకొన్న వ్యతిరేకత, వక్ఫ్‌బిల్లు పుణ్యమాని ముస్లింలలో కొందరు దూరమయ్యే పరిస్థితి నెలకొనడం మమతా బెనర్జీని ఊపిరి సలపనీయడలేదు.
తానే ఒక ఫైర్ బ్రాండ్ అనుకుంటే పార్టీలో ఉన్న ఫైర్‌బ్రాండ్లన్నీ ఇప్పుడు, సొంత కొంపకే నిప్పు పెట్టే స్థితికి చేరుకోవడంతో, మమతా బెనర్జీ ఒక్కసారిగా ‘కూల్’గా, ‘సైలెంట్’గా మారక తప్పలే దు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఆమె నియంత్రణాపరిధిని దాటిపోయినట్టు తెలుస్తోం ది. ఏ చర్య తీసుకున్నా మొత్తం పార్టీ పుట్టిమునగడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇప్పటికే తృణ మూల్‌కు సవాల్ విసురుతున్న భాజపాకు ఈ పరిణామాలన్నీ సానుకూల సంకేతాలిస్తూ, వచ్చే ఎన్నికల్లో అధికారం దగ్గడం ఖాయమన్న విశ్వాసం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నా యకత్వంలో జోష్ నెలకొంది. తన ‘నోరు బలం’తో నెట్టుకొస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు సైలెంట్ కాక తప్పడంలేదు. అవసాన దశలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సామ్రాజ్యం ముక్కలు కావడాన్ని వీక్షించి విపరీతంగా బాధపడిన చందంగా, ఇప్పుడు మమతా బెనర్జీకూడా విభేదాలతో కుప్పకూలి పోతున్న పార్టీని నిస్సహాయంగా చూడక తప్పదా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో ఉన్నవారిలో అధికసంఖ్యాకులు అవినీతి అక్రమాలకు పాల్పడేవారే గనక, తమకిక్కడ రక్షణ లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడటం ఖాయం. అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ విభేదాల దెబ్బకు, ఓటర్ ఐ.డి.కార్డుల బాగోతం తెరమరుగైపోయింది. దీన్నెవరూ పట్టించుకోవడంలేదు. సామ్రాజ్యమే కుప్పకూలిపోయేటప్పుడు, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానం కానీ, ఎదురుదాడికి సమయం కాదు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఇదే!