జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ జి.సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు పోషణతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి రోజు ఆహారంలో పాలు,పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు,గుడ్లు, మాంసకృత్తుల తో పాటు చిరుధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే గర్భంలోని శిశువు అయినా సరే పాలు తాగే పిల్లలు అయినా సరే మంచి ఆరోగ్యంతో ఉంటారని, తల్లులు తీసుకునే ఆహారం పైన పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలు వైద్యులు సూచించినటువంటి చిన్నచిన్న వ్యాయామాలు, దినచర్యలో మార్పులు చేసుకొని, క్రమం తప్పకుండా వైద్యశాలలో చూపించుకుంటూ అవసరమైనటువంటి మందులు సక్రమంగా వాడి సుఖ ప్రసవం పొందాలని తెలియజేశారు. ఇలాంటి ఇంకా చాలా విషయాలన్నీ కలిపి పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను కచ్చితంగా ఉపయోగించుకోవాలని, మీ సమస్యలను తెలియజేస్తూ సూచనలు తీసుకోవాలని, అంగన్వాడి టీచర్లు,ఆశ కార్యకర్తలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తద్వారా పిల్లలు స్కూలుకు వెళ్లడానికి త్వరగా అలవాటు పడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన మరియు 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ జి.సౌజన్య,మిట్టపల్లి పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, డాక్టర్ కమలాకర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, స్కూల్ టీచర్స్, అంగన్వాడి టీచర్లు సరోజ, నిరోష, లావణ్య మరియు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.