
Education Minister
విద్యాశాఖ మంత్రిని నియమించాలి…
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి…
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి…
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల,వసతి గృహాల భవనాలకు సొంత భవనాల నిర్మించాలి…
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి…
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి…
విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి…
వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్…
నేటి ధాత్రి -గార్ల :-
రాష్ట్రంలో పాలకులు లిక్కర్ పై చూపెడుతున్న శ్రద్ధను విద్యారంగం వైపు చూపెట్టని పరిస్థితి దాపురించిందని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, పీడీఎస్ యు జిల్లా కోశాధికారి మునగాల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం గార్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, కిరణ్, ఉదయ్, పృధ్విరాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.