Ensure Free Passage for Ambulances in Warangal
అంబులెన్స్‌లకు దారి కల్పించాలి
గర్భిణీలు, బాలింతల రక్షణకు చర్యలు తీసుకోవాలి
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ చందకాంతయ్య మెమోరియల్ ప్రసూతి ఆసుపత్రి (సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్) కు వెళ్లే గర్భిణీ స్త్రీలు, బాలింతల అంబులెన్స్‌లకు నిరభ్యంతరంగా దారి కల్పించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రి ఆర్ఎంఓ సత్యజిత్‌కు వినతిపత్రం సమర్పించారు.
ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రతిరోజూ వేల సంఖ్యలో గర్భిణీలు, బాలింతలు వివిధ ప్రాంతాల నుండి ప్రసూతి నొప్పులతో బాధపడుతూ ఆటోలు, అంబులెన్స్‌లలో ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అయితే ఆసుపత్రి నుండి పోస్టాఫీస్ చౌరస్తా మీదుగా అండర్ బ్రిడ్జి వరకు రోడ్డు ఇరువైపులా చిరు వ్యాపారులు పందిర్లు వేసుకుని ఆక్రమణలు చేయడం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుని, కొంతమంది గర్భిణీలు రహదారులపైనే ప్రసవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్, ట్రాఫిక్ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రోడ్లపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను సమీప కూరగాయల మార్కెట్‌కు తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్, ఆకుల సురేష్ కుమార్, చింత ఆనంద్, మైదం సంజీవ్, ఎం.డి. సలీం, కొంరయ్య, రౌతు శ్రీనివాస్, మేడిగ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
