"Ambedkar’s Ideals Must Continue: MLA Gandra"
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్..
భూపాలపల్లి నేటిధాత్రి
బడుగు, బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అహింసా మార్గాన్ని ఎంచుకొని పరిపాలన వ్యవస్థను మార్చడంతో పాటు సమానత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. గ్రామాల్లో కుల, మత అనే బేధాలు లేకుండా అందరూ సమానమే అనే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. భారతీయులకు ఆరాధ్యుడు బీ.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
