గ్రామ సభ తీర్మానం ద్వారా కేటాయింపులు జరపాలి.

భద్రాచలం నేటి ధాత్రి

– డబల్ బెడ్ రూమ్ కేటాయింపులపై హైకోర్టులో పూనెం ప్రదీప్ కుమార్ ఫిర్యాదు.

– నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచారి.

– సోమవారం ముగిసిన వాదనలు.

– ఇష్టం వచ్చిన కేటాయింపులు చెల్లవు.

– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి.

భద్రాచలం పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులపై సోమవారం ఉదయం హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రముఖ సీనియర్ హైకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచారి తన వాదనలు వినిపించారు. గతంలోనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఆ లిస్టును కాదని మళ్లీ కొత్తగా లిస్టు తయారుచేసి గ్రామసభ నిర్వహించకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఇది చట్ట విరుద్ధమని, దీనివలన గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి వి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి
డబుల్ బెడ్ రూమ్ పథకంలో లబ్ధిదారులను పిసా చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం ద్వారా కేటాయింపులు జరపాలని అందులో రిట్ పిటిషనర్లకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాధికారులు జిల్లా కలెక్టర్, తహాసిల్దార్, గ్రామపంచాయతీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం పట్టణంలో రెండవ విడతగా ప్రభుత్వం 250 ఇండ్లు కేటాయించగా 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టడం పూర్తయింది. అందుకుగాను 2023 వ సంవత్సరంలో లబ్ధిదారులనుండి దరఖాస్తులు స్వీకరించి భద్రాచలం తహాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది పలుమార్లు విచారణ చేసి 150 మంది లబ్ధిదారులను ఫైనల్ లిస్ట్ తయారుచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వారికి నివేదించడం జరిగింది. తహసిల్దార్ భద్రాచలం ప్రొసీడింగ్స్ RC no. C/124/2023. Dt 05-06-2023 ను అమలు చేయ కపోవడం ద్వారా తమకు అన్యాయం జరిగిందంటూ రిట్ పిటిషనర్స్
పూనెం ప్రదీప్ కుమార్, బచ్చల మల్లేశ్వరరావు, పాతులూరి కవిత, పసుపులేటి చాముండేశ్వరి, సున్నం మంజుల ఇంకా 145 మంది లబ్ధిదారులను కలిపి ఎంపిక చేసినప్పటికీ వారికి ఇండ్లు కేటాయించకుండా సుమారు సంవత్సరనర రోజుల నుండి ఎప్పటికప్పుడు మీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు ఇస్తామని చెబుతూ రాజకీయ ఒత్తిడిల వలన మొదట ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వలేదు. రాజకీయ స్వార్థంతో మరల కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి రహస్యంగా వారికి ఇండ్లను అప్పజెప్పే పనిలో అధికారులు ప్రయత్నిస్తుండగా సదరు రిట్ పిటిషన్ దారులు పూనెం ప్రదీప్ కుమార్ ఇతరులు హైకోర్టును ఆశ్రయించి WP No 35983/2024 ను దాఖలు చేయగా తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి వి భాస్కర్ రెడ్డి బెంచ్ ముందు విచారణకు రావడం జరిగింది. న్యాయమూర్తి
పిటిషనర్ల వాదనతో పాటు ప్రభుత్వ తరపు గవర్నమెంట్ ప్లీడర్ (జిపి రెవిన్యూ) వాదనలు విని మొదట ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మరో కారణంతో గ్రామ సభ నిర్వహించకుండా మరల లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని, పిసా గ్రామ సభ నిర్వహించి గ్రామసభ మెజార్టీ తీర్మానం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని, చట్ట పరిధిలో చేయాల్సిన పనిని ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ (జిపి రెవెన్యూ) గోదావరి వరద బాధితులకు, కరకట్ట నిర్వాసితులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలపగా దానికి న్యాయమూర్తి స్పందిస్తూ గత సంవత్సరం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు వీరికి ఎలా ఇస్తారని ఆయన అన్నారు. దానికి దీనికి సంబంధం లేదని తెలిపారు. పిటిషనర్లు తమ అభ్యర్థనను గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడు సమర్పించాలని, పిటిషనర్ల అభ్యర్థనను పరిగణలోనికి తీసుకొని పరిశీలించి మూడు నెలల లోపు తగిన కేటాయింపులు చేయాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!