
Allotment of double bedroom houses to deserving people...

ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో సతీష్ కుమార్,కమిషనర్ గద్దె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగింది. మంచిర్యాల్ ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు లాటరీ ద్వారా చీటీలు తీసి అర్హులకు ఇండ్ల నెంబర్లను అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే విద్యార్థులతో లాటరీ ద్వారా చీటీలు తీయించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు మొదటగా 13 ఇండ్లను లాటరీ ద్వారా అందించిన అనంతరం 217 ఇండ్లను అందరికీ కలిపి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగిందో వారి బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ , ఎలక్షన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ లు తీసుకొని సాఫ్ట్ వేర్ లో డాటా ఎంట్రీ చేసిన అనంతరం పట్టా సర్టిఫికేట్ రాగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లును అందజేస్తామని తెలిపారు.ఇండ్ల కేటాయింపు స్థలమైన క్లబ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు పరిశీలించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.