
వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇవ్వండి
ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి
జర్నలిస్టులు ఏలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ జాగృతికి నిరంతరం కృషి చేస్తున్నారని, వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ షరతులు లేకుండా ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు, కార్యదర్శి గడ్డం సత్యా గౌడ్ లు మాట్లాడుతూ భూముల ధరలు ఆకాశాన్ని అంటగా, వైద్యం చాలా పిరమైపోయిందని, ఈ నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులు ఇంటి స్థలం కొనలేని పరిస్థితిలో అద్దె ఇండ్లలో ఉండి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేటికీ పాత్రికేయుల సొంతింటి కల కలగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొందరికి ఇండ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ( జర్నలిస్టులకు) ఆశలు చిగురించాయని అన్నారు. అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం మాట్లాడే హక్కును హరించినా.. మీడియా ఎంతో ధైర్యంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపిందని తెలిపారు.
ప్రజలకు పూర్తి పారదర్శక పాలన అందించడంలో పాత్రికేయుల సహకారం ఎంతో అవసరమని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఏ ప్రభుత్వానికైనా చెవులు, కళ్లు మీడియానే కాబట్టి, మీడియాలో పనిచేసే విలేకరుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం వల్ల పారదర్శకమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, సమాజహితం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లైతే వారి కుటుంబాల స్వంతింటి కళను సహకారం చేసినట్లు అవుతుందని తెలిపారు.
శాసనసభ్యులుగా తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించి, ఈ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాద్యక్షలు కామెర వెంకటస్వామి, జే సతీష్, కోశాధికారి సబ్బని భాస్కర్, జాయింట్ సెక్రెటరీ బి సుమన్, జి సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ సురేష్, ఈసీ మెంబర్స్ ఎం వేణుగోపాల్ గౌడ్, ఏ శ్రీనివాస్, వీరస్వామి, యూనియన్ సభ్యులు దేవరపల్లి ప్రభాకర్, మహమ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.