సదరం స్లాట్‌లు తక్కువ… సర్టిఫికెట్ కావాల్సిన వారు ఎక్కువ

• నిమిషాల వ్యవధిలో క్లోజ్

• ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు

హసన్ పర్తి/ నేటి ధాత్రి

సదరం క్యాంపునకు హాజరు కావాలనుకునే దివ్యాంగులకు నెలల తరబడి తిరిగినా స్లాట్ బుక్ కావడం లేదు. నెల, రెండు నెలలకోసారి అధికారులు స్లాట్స్ విడుదల చేయగానే.. నిమిషాల్లో క్లోజ్ అయిపోతున్నాయి. సదరం క్యాంపునకు హాజరయ్యేందుకు ఎదురు చూసే దివ్యాంగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్లాట్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో వారు ఒక నెల బుకింగ్స్ అయిపోతే మరో నెల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న దివ్యాంగులు ఎంతో మంది ఉన్నారు.

స్లాట్స్ రిలీజైన రోజు మీసేవ కేంద్రాల్లో బారులు

వైకల్య ధ్రువీకరణ కోసం ఎవరైనా సదరం క్యాంపులకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో మండల, డివిజన్ కేంద్రాల్లో ఒకేసారి వేలాది మందికి క్యాంపులు పెట్టి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ, ఆ తర్వాత నెలకు 50 నుంచి 100 సాట్ల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కంటి చూపు, ఆర్థో, మానసిక బుద్ధి మాంద్యం, వినికిడి(మూగ, చెవుడు) తదితర దివ్యాంగులను అసెస్ చేస్తున్నారు. డీఆర్డీఏ ముందుగా ప్రకటించిన రోజున నిర్ణీత సమయంలోనే మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ప్రకటించిన రోజు జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వారి బంధువులు బారులు తీరుతున్నారు. ఆపరేటర్లు స్లాట్ కోసం వివరాలు నమోదు చేయడం ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే మొత్తం స్లాట్స్ క్లోజ్ అయినట్లు చూపుతుండడంతో చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒక్కో సెంటర్లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే నమోదవుతున్నట్లు ఆపరేటర్లు వెల్లడిస్తున్నారు.

రెన్యువల్ కోసం ఇబ్బందులు..

వైకల్యాన్ని నిర్ధారించే క్రమంలోనే కొందరికి పర్మినెంట్ సదరం సర్టిఫికెట్, మరికొందరికి రెండు, మూడేండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. ఇలా రెండు, మూడేండ్ల కాలపరిమితితో సర్టిఫికెట్లు పొందినవాళ్లు..గడువు తీరిన తర్వాత మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఆసరా పింఛన్ ఆగిపోతుంది. ఇలాంటి వారు స్లాట్స్ బుక్ కాక నెలల తరబడి మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో నెలలు, సంవత్సరాల తరబడి పింఛన్ కోల్పోతున్న బాధితులు వందల్లో ఉన్నారు. ఇది తమ హక్కులను హరించడమేనని, ఇప్పటికైనా స్లాట్స్ సంఖ్య పెంచి అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. దివ్యాంగులకు స్లాట్ వ్యవస్థ ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్లాట్ దొరకకపోవడం వల్ల సదరం సర్టిఫికెట్ పొందలేకపోవడం, పింఛన్ రాకపోవడం దివ్యాంగుల హక్కుల చట్టం ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు నాయకులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *