
Full Preparations for Vinayaka Immersion in Sircilla
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.