
Akshara-Purushottam Darshanam
ప్రపంచ సంస్కృత మహాసభలో “అక్షర-పురుషోత్తమ దర్శనం”పై స్పెషల్ సెషన్
వేదాంత చరిత్రలో మరో కీలక మలుపు…ప్రపంచ సంస్కృత మహాసభలో తొలిసారిగా అక్షర-పురుషోత్తమ దర్శనానికి విశిష్ట సెషన్! భగవాన్ స్వామినారాయణ బోధించిన వేదాంత సిద్ధాంతానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం. నేపాల్ భూమి, సంస్కృత పండితులు, శాస్త్రీయ చర్చలు… ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో…
ఈసారి నేపాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ఐదు రోజుల ఈ సదస్సు… మరో విశేషానికి వేదికైంది. నేపాల్‌తో ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తిస్తూ.. భగవాన్ స్వామినారాయణు ప్రకటించిన తత్త్వాలలో అక్షర-పురుషోత్తమ దర్శనానికి (Akshar-Purushottam Darshan) ప్రత్యేక శాస్త్రీయ సెషన్ ఏర్పాటైంది. ఇది నేపాల్‌లో మొదటిసారిగా ఈ తత్వశాస్త్రాన్ని విద్యావేత్తల సమక్షంలో అధికారికంగా పరిచయం చేసిన చారిత్రక సంఘటనగా నిలిచింది.
18వ శతాబ్దం చివర్లో భగవాన్ స్వామినారాయణ మూడు సంవత్సరాలకు పైగా నేపాల్ యాత్ర చేశారు. ఈ యాత్రలో ఆయన తపస్సు, యోగసాధన, ఆధ్యాత్మిక బోధనలతో నేపాల్ భూమిని పవిత్రం చేశారు. ఈ యాత్ర సందర్భంగానే ఆయన అక్షర-పురుషోత్తమ దర్శనం అనే ఆధునిక వేదాంత పాఠాన్ని వ్యక్తపరిచారు. ఇది ఇప్పుడు వేదాంతంలో ఒక ప్రత్యేక పాఠశాలగా గుర్తింపు పొందింది.
ప్రతిష్టాత్మక అతిథులు: ఈ సెషన్లో పలువురు ప్రముఖ విద్యావేత్తలు, వర్సిటీ వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు:
- శ్రీ కాశీనాథ్ న్యౌపానే – ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త
- ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి – కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీ
- ప్రొఫెసర్ ముర్లీ మనోహర్ పాఠక్ – లాల్ బహదూర్ శాస్త్రీ సంస్కృత విశ్వవిద్యాలయం
- ఇతర వర్సిటీల వైస్ చాన్సలర్లు – తిరుపతి, గుజరాత్, నాగపూర్, రాజస్థాన్, ఉజ్జయినీ, కాశీ, తదితర ప్రాంతాల నుండి
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సభ్యులు
- నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం, జయతు సంస్కృతం, నేపాల్ పండిట్ మహాసభ వంటి సంస్థల ప్రతినిధులు
శాస్త్రీయ పత్రాలు – సిద్ధాంత వైశిష్ట్యం: ఈ ప్రత్యేక సెషన్లో అక్షర-పురుషోత్తమ దర్శనంపై ప్రముఖ పండితులు వివిధ కోణాల్లో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు:
- డా. ఆత్మతృప్తదాస్ స్వామి – 21వ శతాబ్ద సంస్కృత సాహిత్యంలో స్వామినారాయణ భాష్యాల నిర్మాణ ప్రక్రియపై అధ్యయం
- డా. అక్షరానందదాస్ స్వామి – భగవద్గీతలో ధర్మతత్వంపై అక్షర-పురుషోత్తమ దృష్టి
- ఆచార్య బ్రహ్మానందదాస్ స్వామి – పరబ్రహ్మ స్వామినారాయణుని అవతార తత్వం
- డా. జ్ఞానతృప్తదాస్ స్వామి – వచనామృతంలోని అక్షర-పురుషోత్తమ సిద్ధాంతం
- ఇతర పండితులు – బ్రహ్మ-ఆత్మ ఏకత్వం, అక్షరబ్రహ్మ తత్వం, గీతా భాష్య విశ్లేషణ, విశిష్టాద్వైతంతో తులనాత్మక అధ్యయనాలు
సెషన్ ముగింపు సమయంలో ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి మాట్లాడుతూ..“అక్షర-పురుషోత్తమ దర్శనం వేదాంతంలో ఒక ప్రత్యేకమైన, మౌలికమైన మానవతాత్మక ఆవిష్కరణ. ఇది వేదపరంపరలో కొత్త వెలుగుల్ని నింపుతుంది” అని కొనియాడారు. ఇదే సందర్భంలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని అధికారికంగా తమ సిలబస్‌లో చేర్చినట్టు ప్రకటించారు.
స్వామి భద్రేశ్దాస్ తన ముగింపు ప్రసంగంలో నేపాల్ భూమికి భగవాన్ స్వామినారాయణుని పవిత్ర పాదయాత్రతో ఏర్పడిన ఆధ్యాత్మిక పునీతతను గుర్తుచేశారు. అక్షర-పురుషోత్తమ దర్శనం ద్వారా సానాతన వేదిక పరంపరలోకి ఒక కొత్త అధ్యాయం ప్రవేశించిందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ “ఈరోజు నేపాల్ భూమి అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని గౌరవంగా ఆహ్వానిస్తూ, శాస్త్రీయంగా స్థాపన చేయడం సంతోషంగా ప్రకటిస్తున్నాం” అని ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త శ్రీ కాశీనాథ్ న్యౌపానే వ్యాఖ్యానించారు.
ఈ సదస్సు కేవలం ఒక విద్యా కార్యక్రమం కాదు. ఇది భగవాన్ స్వామినారాయణుడు, వేదాంత తత్త్వాలు, నేపాల్ భూమి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ఒక మైలు రాయి.